logo

ఓటుకు సెలవివ్వొద్దు..!

లోక్‌సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది.

Published : 08 May 2024 03:56 IST

ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట: లోక్‌సభ ఎన్నికల హడావుడి ముమ్మరమైంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వాడీవేడిగా జరుగుతోంది. ఓటుహక్కుపై అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. సుపరిపాలన అందించే నిస్వార్థ నాయకుణ్ని ఎన్నుకోవడంలో ఓటర్లంతా భాగస్వాములు కావాలని ఓటర్లలో చైతన్యం తీసుకొస్తోంది.

ఓటు వేసేందుకే..

ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల రోజు ఈసీ సెలవు ప్రకటించింది. అందుకే లోక్‌సభ ఎన్నికలు జరిగే ఈనెల 13 సెలవు. అంతకు ముందు ఆదివారం సహా రెండో శనివారం. ఇలా వరసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. దీంతో ఇంటిల్లిపాది ఎక్కడికైనా వెళ్దామని భావించే అవకాశముంది. అయితే పోలింగ్‌ రోజును సెలవు దినంగా భావిస్తే సమున్నత లక్ష్యానికి విఘాతం కలుగుతుందన్న విషయం మరచిపోకూడదు.

పోలింగ్‌ సమయం పొడిగింపు

ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లడానికి ప్రజలు భయప£డుతున్నారు. పోలింగ్‌ రోజూ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 46 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగించింది. ఇది వృద్ధులు, మహిళలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఉదయం 7 గంటల నుంచి 11 గంటలలోపు లేదా సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు ఓటేసే అవకాశం ఉంది.

యువతే కీలకం

ఓటుహక్కు వినియోగించడంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం చాలామంది స్వస్థలాలకు దూరంగా, పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి పోలింగ్‌కు ముందు రోజు కూడా సెలవు ఉన్నందున ఎక్కడ ఉన్నా సొంత ప్రాంతాలకు చేరుకునేందుకు అవకాశం ఉంది. యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఊపిరులూదిన వారవుతారు. వారు ఓటుహక్కు వినియోగించుకోవడంతో పాటు దివ్యాంగులు, వృద్ధులకు చేయూతనందించే ప్రయత్నం చేయాలి.

2019 ఓటింగ్‌ శాతాన్ని దాటేలా..

ఉమ్మడి నల్గొండలోని భువనగిరి, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ స్థానాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో 78.60 శాతం పోలింగ్‌ నమోదైంది. అంతకు మించి పోలింగ్‌ శాతం పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరగాలంటే ఓటుహక్కు ఉన్న వారంతా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు