logo

ప్రైవేటు పనులకు.. ప్రభుత్వ పరికరాలు

జిల్లాలోని విద్యుత్తు సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులతో విద్యుత్తుశాఖ సిబ్బంది కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వ పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులకు అప్పగిస్తున్నారు.

Updated : 08 May 2024 06:17 IST

విద్యుత్తు సంస్థలో అవినీతి బాగోతం

ఈ చిత్రం నల్గొండ నాగార్జున కాలనీలో ఒక అపార్టుమెంటు వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రిక. అక్కడ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి విద్యుత్తుశాఖకు చెందిన స్తంభాలు, ఇతర పరికరాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి టర్న్‌కి పద్ధతిలో ఒప్పందం చేసుకున్న గుత్తేదారుడే విద్యుత్తు నియంత్రిక మినహా ఇతర పరికరాలు ప్రైవేటు మార్కెటులో కొనుగోలు చేసి పని పూర్తి చేయాల్సి ఉంటుంది.  


నల్గొండలోని ఓ రెస్టారెంటు పక్క వీధిలో ఓ బహుళ అంతస్తు భవనం వద్ద విద్యుత్తు నియంత్రికను టర్న్‌కి పద్ధతిలో ఏర్పాటు చేశారు. సదరు గుత్తేదారుడు మాత్రం కాసుల కక్కుర్తితో విద్యుత్తు అధికారులతో కుమ్మక్కై విద్యుత్తు సంస్థకు సంబంధించిన ఎస్‌పీడీసీఎల్‌ ముద్ర ఉన్న స్తంభాలు, పరికరాలు ఉపయోగించినట్లు ‘న్యూస్‌టుడే’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది.

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: జిల్లాలోని విద్యుత్తు సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులతో విద్యుత్తుశాఖ సిబ్బంది కుమ్మక్కవుతున్నారు. ప్రభుత్వ పరికరాలను నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లల్లో వందల సంఖ్యలో అపార్టుమెంట్లు, ఫంక్షన్‌హాల్స్‌, వెంచర్లల్లో ఏర్పాటు చేస్తున్న విద్యుద్ధీకరణ పనుల పేర రూ.లక్షల నిధులను పక్కదారి పట్టిస్తూ జేబులు నింపుకొంటున్నారు.

అక్రమాలు ఇలా...

విద్యుత్తు సంస్థలో రెండు పద్ధతుల్లో విద్యుద్ధీకరణ పనులు చేపడుతారు. అందులో మొదటి పద్ధతి ఏర్పాటు చేయాల్సిన లైన్ల దూరం, స్తంభాల సంఖ్య, విద్యుత్తు నియంత్రిక, ఇతర పరికరాలతో కలిపి సంబంధిత ఏఈ అంచనా తయారు చేస్తారు. వినియోగదారులు వందశాతం చెల్లిస్తే సంస్థ ఆధ్వర్యంలో విద్యుద్ధీకరణ పనులు చేపడుతారు. ఇక రెండో పద్ధతి అంటే క్షేత్రస్థాయి అధికారి ప్రతిపాదించిన అంచనాలో విద్యుత్తు నియంత్రిక ఖర్చుతో పాటు స్తంభాలు, ఇతర పరికరాల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో 10 శాతం విద్యుత్తు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. బహుళ అంతస్తుల యజమానులు, ఫంక్షన్‌హాల్స్‌ నిర్వాహకులు, స్తిరాస్థి వ్యాపారులు ఎక్కువగా రెండో పద్ధతినే ఎంచుకుంటున్నారు. సదరు దరఖాస్తుదారులు విద్యుత్తు సంస్థకు 10 శాతం నిధులు చెల్లించి విద్యుద్ధీకరణ పనులను గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. కాంట్రాక్టర్లు ప్రైవేటు మార్కెటులో స్తంభాలు, ఇతర పరికరాలు కొనుగోలు చేసి విద్యుద్ధీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ.. ఏఈలతో కలిసి రైతులకు ఇవ్వాల్సిన స్తంభాలు, పరికరాలను ప్రైవేటు  పనులకు ఉపయోగిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.


విచారణ చేసి విధుల నుంచి తొలగిస్తాం

చంద్రమోహన్‌, ఎస్‌ఈ విద్యుత్తు సంస్థ, నల్గొండ జిల్లా

టర్న్‌కి పద్ధతిలో చేపట్టిన విద్యుద్ధీకరణ పనుల్లో విద్యుత్తు సంస్థకు సంబంధించిన స్తంభాలు ఉపయోగించకూడదు. ఎక్కడైన ఏర్పాటు చేసినట్లు మా దృష్టికి తీసుకొస్తే తక్షణమే క్షేతస్థాయిలో పరిశీలిస్తాం. తప్పు జరిగితే వెంటనే సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేస్తాం. గుత్తేదారుల నుంచి సొమ్ము రికవరీ చేస్తాం. వారిని బ్లాక్‌ లిస్టులో పెడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు