బాలికతో ప్రేమ బంధం.. తండ్రీ కూతుళ్లమంటూ లాడ్జీలో బస.. ఆత్మహత్యాయత్నం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామయ్య
బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్టుడే : అతనికి 36 ఏళ్లు.. ఆ బాలికకు 17 ఏళ్లు.. ఇద్దరూ దూరపు బంధువులు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. ఇద్దరూ కలసి తనువు చాలించాలనుకున్నారు. లాడ్జీలో దిగారు. విషం తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెంలో బుధవారం జరిగిన ఘటన. సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం. దగదర్తి మండలంలోని బాడుగులపాడుకు చెందిన గద్దె రామయ్య కూలి పనులు చేస్తుంటాడు. ఇతనికి పదిహేనేళ్ల క్రితం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని ఓ మహిళతో వివాహమైంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దూరపు బంధువైన జలదంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ప్రేమాయణం సాగించాడు. కొడుకు లేడన్న నెపంతో వివాహం చేసుకోవాలనున్నాడు. ఈ విషయం ఇరువురి ఇళ్లలో తెలిసి మందలించారు. వివాహానికి అంగీకరించలేదు. బాలిక తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు ఉండడంతో వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని ఓ గ్రామంలో పెద్దమ్మ దగ్గర ఉంటుంది. ఆమెతో రామయ్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండేవాడు. పెద్దలు వివాహానికి అంగీకరించకపోవడంతో మంగళవారం అక్కడికి వెళ్లాడు. బాలికను తీసుకొని బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి వచ్చాడు. తండ్రీ కుమార్తెలమని చెప్పి ముంబాయి రహదారి పక్కనున్న ఓ లాడ్జీలో గది తీసుకున్నాడు. బుధవారం వేకువజామున విషం తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉదయాన్నే లాడ్జీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఇరువురినీ నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు.కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ కోటేశ్వరరావు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.