logo

మాతృదేశానికి విజ్ఞాన ఫలాలు

నెల్లూరు కలలు కనండి.. వాటి సాకారానికి కృషి చేయండి... అని అనేక సందర్భాల్లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చెప్పిన మాటల్ని ఆచరించారామె. మేనత్త భర్త విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా కొనసాగిన తీరు ఈమెను ప్రభావితం చేసింది. ఆ దిశగా రాణించాలనే కలను నిజం చేసుకునేందుకు

Published : 24 Jan 2022 06:12 IST

వీఎస్‌య సహాయ ఆచార్యురాలు కిరణ్మయి విజయ ప్రస్థానం

కరలూమా ప్లాంటులో..

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు కలలు కనండి.. వాటి సాకారానికి కృషి చేయండి... అని అనేక సందర్భాల్లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చెప్పిన మాటల్ని ఆచరించారామె. మేనత్త భర్త విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా కొనసాగిన తీరు ఈమెను ప్రభావితం చేసింది. ఆ దిశగా రాణించాలనే కలను నిజం చేసుకునేందుకు కంకణబద్ధురాలయ్యారు. అనంతపురం నుంచి అమెరికా వరకు తన ప్రస్థానాన్ని సాగించారు. అక్కడ అనేక పరిశోధనలు చేసి.. మాతృదేశానికే ఆ విజ్ఞాన ఫలాలు పంచాలని తిరిగి జన్మభూమిపై కాలుమోపారు. వీఎస్‌యూ నుంచి మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి నిపుణుల అంచనాల కమిటీ (పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు) సభ్యురాలిగా నియమితులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగిన కిరణ్మయి ‘ఈనాడు’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

కుటుంబం, విద్య

మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. నాన్న శివరాఘవరెడ్డి రైతు. కొంతకాలం టెలీ కమ్యూనికేషన్‌ విభాగంలో కాంట్రాక్టర్‌గా పనిచేశారు. అమ్మ సుబ్బలక్ష్మమ్మ గృహిణి. ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు అనంతపురంలోనే సాగింది. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన తర్వాత ప్లాంట్‌ టిష్యూ కల్చర్‌ సంబంధ అంశంపై పరిశోధన చేశా. పీహెచ్‌డీ చేస్తూ ఎమ్మెస్సీ విద్యార్థులకు ఒప్పంద పద్ధతిలో బోధించేందుకు అధ్యాపకురాలిగా మూడేళ్లు పనిచేశా. 2006లో పీహెచ్‌డీ పూర్తయ్యింది. పరిశోధనలపై జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో 42 ఆర్టికల్స్‌ ప్రచురితమయ్యాయి.

వైద్యశాస్త్రం చదవకున్నా.. వైద్యురాలిగా..

పీహెచ్‌డీ వైవా జరిగిన మూడో రోజే పెళ్లి. అది కాస్త ఆందోళనగా అనిపించింది. పెళ్లికి కావాల్సిన నగలు, దుస్తులు కూడా నింపాదిగా కొనే పరిస్థితి లేదు. వైవా కోసం సిద్ధం కావడంలోనే సమయం గడిచిపోయింది. పెళ్లైన వెంటనే అమెరికా ప్రయాణం. అమెరికాలోని నోవా సౌత్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో రీసెర్చి అసోసియేట్‌గా అవకాశం లభించింది. అక్కడ పంటికి(డెంటల్‌) సంబంధించిన మూలకణాలపై ఏడాదిపాటు పరిశోధన చేశా. ఈ పరిశోధన వివరాలపై అక్కడి మీడియాలో రెండు పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి.

మయామి వెటరన్‌ అఫైర్స్‌ మెడికల్‌ సెంటర్‌లో కార్డియో వాస్క్యులార్‌ డిసీజెస్‌పై పోస్టు డాక్టరేట్‌గా అయిదేళ్లపాటు పరిశోధన చేసే అవకాశాన్ని అదృష్టంగా భావించి అంకితభావంతో పూర్తిచేశా. నిజానికి మా నాన్న నన్ను మెడిసిన్‌ చదివించాలనుకున్నారు. కారణాలేమైనా అది సాధ్యం కాలేదు. అయితే అమెరికాలో వైద్యపరమైన అంశంపై పరిశోధనలో భాగంగా నిత్యం రోగులతో మమేకమై పనిచేశా. సౌత్‌ ఫ్లోరిడా రీసెర్చ్‌ ఫౌండేషన్‌లో బయోసేఫ్టీ రెగ్యులేషన్స్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేశా. l అరుదైన ఔషధ మొక్కలు జనబహుళ్యానికి అందుబాటులో లేకుండాపోతున్నాయి. వీటిని సంరక్షించి వాటిని టిష్యూ కల్చర్‌ ద్వారా వృద్ధి చేస్తున్నాం.

అరుదైన ఔపధగుణ జాతి మొక్కలపై పరిశోధన

అరుదైన ఔషధ గుణ జాతి మొక్కలు అనేక రకాలున్నాయి. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుని కృత్రిమ వాతావరణంలో వాటిని వృద్ధి చేస్తున్నాం. వీటిలో డయాబెటిస్‌, ఊబకాయం నియంత్రించే ఔషధం ఉంది. ఈ ఔషధ కాంపొనెంట్‌ను పెంచే దిశగా కూడా ప్రయోగాలు చేస్తున్నాం. మరో రెండేళ్లలో ఈ ప్రయోగాలు పూర్తి చేస్తాం.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పుష్పగుచ్ఛమిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని