logo

డీఎస్సీ98 అభ్యర్థులకు ఖాళీలేవి?

డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఖాళీల వివరాలను కోరింది. ఈ ఆదేశాలు విద్యాశాఖ యంత్రాంగంలో చర్చనీయాంశ మయ్యాయి.

Published : 02 Feb 2023 02:24 IST

ధ్రువపత్రాల పరిశీలన ముగిసి ఆరునెలలు
భర్తీకి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
న్యూస్‌టుడే, నెల్లూరు (విద్య)

మంత్రి గోవర్ధన్‌రెడ్డికి సమస్య వివరిస్తున్న డీఎస్సీ-98 అభ్యర్థులు (పాతచిత్రం)

డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఖాళీల వివరాలను కోరింది. ఈ ఆదేశాలు విద్యాశాఖ యంత్రాంగంలో చర్చనీయాంశ మయ్యాయి. ఇప్పటికే జిల్లా అధికారులు ప్రతి పాఠశాలలో పాఠ్యాంశ ఉపాధ్యాయులు మొదలుకొని ఎస్జీటీల వరకు మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ఖాళీలు లేకుండా చర్యలు చేపట్టారు. తాజాగా ప్రభుత్వం డీఎస్సీ 98 అభ్యర్థులకు ఎన్నికల హామీలో భాగంగా పోస్టింగులు ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు సరిపడా ఖాళీలు లేవని, వారందరినీ ఎలా సర్దుబాటు చేయాలోనని విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

విలీనంతో మిగులు

పాఠశాలల విలీనం.. టీచర్ల హేతుబద్ధీకరణ, ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రభుత్వ పరిధిలోకి రావడంతో విద్యాశాఖకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులు పెద్దఎత్తున సమకూరారు. ఉన్నత పాఠశాలల నుంచి ప్రాథమిక బడుల వరకు ఎక్కడా ఉపాధ్యాయుల కొరతనేది లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దాంతో ఉన్నత పాఠశాలలకు సరిపడా పాఠ్యాంశ ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలలకు ఎస్జీటీలు సరిపడా వచ్చారు. ఈ సర్దుబాటు ప్రక్రియ ముగిసినా ఇంకా మిగులు టీచర్లు 200 మంది వరకు ఉండటం గమనార్హం. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేందుకు వారి వివరాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖాళీల వివరాలను పంపాలని ఆదేశించింది.

ఒకవైపు పాఠ్యాంశ టీచర్లు, మరోవైపు ఎస్జీటీలు అనేక మంది పోస్టింగులు లేక వారి సేవలను వివిధ పనులకు వినియోగించుకుంటున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. డీఎస్సీ-98 అభ్యర్థులు మాత్రం పోస్టింగులు ఎప్పుడు ఇస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.


పురపాలక బడుల్లో కొరత

డీఎస్సీ-98 అభ్యర్థులకు మినిమం టైం స్కేల్‌ ఇచ్చి వారి సేవలను వినియోగించుకునేలా పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం.. ఆరునెలల కిందటే వారి వివరాలను సేకరించి ధ్రువపత్రాలను పరిశీలించింది. వారికి ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంలో తాత్సారం చేసింది. జిల్లాలో ఇటీవల 600 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయగా.. ఇంకా మిగులు ఉన్నారని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అలాంటి వారిని పురపాలక బడులకు తాత్కాలికంగా పంపి వారి సేవలను వినియోగించుకుంటే ఆయా చోట్ల టీచర్ల సమస్య పరిష్కారమవుతుంది. జడ్పీ పాఠశాలల్లోని మిగులు ఉపాధ్యాయులను కొంతమేర సర్దుబాటు చేసి ఆయా పాఠశాలల్లో నియమించినా ఇంకా కొరత వేధిస్తూనే ఉంది. జిల్లాలో మిగులు ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌లో 200 మంది ఉన్నట్లు విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు.


త్వరితగతిన ఉద్యోగావకాశం కల్పించాలి

శ్రీనివాసులు, డీఎస్సీ-98 సంఘ కార్యదర్శి

ప్రభుత్వం మాకు త్వరితగతిన ఉద్యోగావకాశం కల్పించాలి. ఈ దిశగా మేం కలవని అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు లేరు. ఇప్పటికే మాలో ఆశ చచ్చిపోయింది. ఇంకా మమ్మల్ని తిప్పుకోకుండా మినిమం టైం స్కేల్‌ సేవల్లో వెంటనే నియమించాలి.

      

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని