logo

మూతపడిన నోడల్‌ స్టోరు

మండల నోడల్‌ స్టోరు. ఈ పేరు వింటే గుడ్లూరు మండలంలోని దుకాణదారులకు ప్రాణం లేచి వస్తుంది. పట్టణాల నుంచి సరకులు తెచ్చుకుని దుకాణాల్లో విక్రయిస్తే మిగిలేది కొంతమాత్రమే.

Published : 06 Feb 2023 02:19 IST

మహిళలకు ఇబ్బందులు
కందుకూరు,(గుడ్లూరు), న్యూస్‌టుడే

మూతబడిన దుకాణం

మండల నోడల్‌ స్టోరు. ఈ పేరు వింటే గుడ్లూరు మండలంలోని దుకాణదారులకు ప్రాణం లేచి వస్తుంది. పట్టణాల నుంచి సరకులు తెచ్చుకుని దుకాణాల్లో విక్రయిస్తే మిగిలేది కొంతమాత్రమే. అవే వస్తువులను ఆర్‌ఆర్‌సీలో కొనుగోలు చేసి చిల్లర దుకాణాల ద్వారా విక్రయిస్తే లాభాలు అధికంగా ఉండేవి. ఇదంతా ఒకప్పటి సంగతి. ప్రస్తుతం రూరల్‌ రిటైల్‌ చైన్‌ (ఆర్‌ఆర్‌సీ) నెలరోజులుగా తెరుచుకోవటంలేదు. దీంతో మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అప్పటి తెదేపా ప్రభుత్వం పదకొండు మండల కేంద్రాల్లో రూరల్‌ రిటైల్‌చైన్‌ కింద నోడల్‌ స్టోర్సును 2014లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ దుకాణాన్ని నిర్వహింస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సంఘాల్లోని మహిళలు గ్రామాల్లో కిరాణ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే వారికి హోల్‌సేల్‌ ధరలకే దీని నుంచి సరకులు  ఇచ్చేవారు. మహిళలు ఆర్థికంగా లాభపడాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.

* మండల కేంద్రం గుడ్లూరులో సుమారు రూ.15 లక్షల మూల ధనంతో దుకాణం ఏర్పాటైంది. అమ్మకాలు, నిర్వహణలో తెదేపా ప్రభుత్వం ఉన్న అయిదు సంవత్సరాలపాటు రాష్ట్రంలో ఈ దుకాణం ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి మండలంలోని గ్రామాల్లో 90 మంది మహిళా సభ్యులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు సరకులు సరఫరా అవుతుండేవి. సంవత్సరానికి సుమారు రూ.కోటి వరకు లావాదేవీలు నిర్వహించే వారు.

* 2019 నుంచి ఈ దుకాణం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గతంలో మహిళా సంఘాల సభ్యులు దుకాణం నిర్వహించే వారు. ప్రభుత్వం మారిన తరువాత పాత వారిని తొలగించి వెలుగు సీసీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పూర్తి స్థాయిలో నిర్వహణపై శ్రద్ధ పెట్టకపోవడంతో అమ్మకాలు క్రమంగా తగ్గాయి. దీనికి తోడు ప్రధానవీధిలో పెద్ద దుకాణం నుంచి బ్యాంకు సమీపంలోని చిన్న గృహంలోకి మార్చడంతో వస్తువుల సంఖ్య తగ్గింది. అమ్మకాలు సరిగా లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యంతో రాష్ట్రంలో పేరు తెచ్చుకున్న దుకాణం నేడు మూతబడి ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్దేశం పక్కదారిపట్టింది. మహిళా సంఘాలకు దుకాణ నిర్వహణ బాధ్యతలను అప్పగించి పూర్వవైభవాన్ని తీసుకు రావాలని పలువురు మహిళా సంఘ సభ్యులు కోరుతున్నారు.


అనారోగ్యంతో తెరవలేదు

- అశోక్‌ , ఏపీఎం, గుడ్లూరు

గత మూడు సంవత్సరాలుగా వెలుగు సీసీ ద్వారా అమ్మకాలు చేస్తున్నాం. పాత భవనం అసౌకర్యంగా ఉండటంతో బ్యాంకు సమీపంలోని గృహానికి మార్చాం. నిర్వహణ చూస్తున్న సీసీ అనారోగ్యంతో ఉండటంతో దుకాణం తెరవలేకపోయారు. పరిశీలించి మళ్లీ దుకాణాన్ని తెరిచి ఎప్పటిలా లావాదేవీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని