logo

ప్రసవానికొస్తే కోతే!

కాన్పుల్లో కోతలు ఆగడం లేదు. ప్రభుత్వం సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం మార్పు కనిపించడం లేదు.

Updated : 24 Mar 2023 06:30 IST

లక్ష్యానికి దూరంగా ప్రభుత్వ ఆసుపత్రులు

ప్రైవేటులో 80 శాతం శస్త్రచికిత్సలే

కాన్పుల్లో కోతలు ఆగడం లేదు. ప్రభుత్వం సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం మార్పు కనిపించడం లేదు. ఏటేటా ఆ సంఖ్య పెరుగుతుండగా- శస్త్రచికిత్సల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విఫలమవుతున్నాయి. సాధారణ ప్రసవాలు పెంచడానికి నిర్వహిస్తున్న సదస్సులు, అవగాహన తరగతులు, సమీక్షలు నామమాత్రంగా మిగులుతున్నాయి. ఫలితంగా జిల్లాలో ఏడాదికి సగటున 75 కాన్పులు జరుగుతుంటే... అందులో 50కిపైగా శస్త్రచికిత్సలే కావడం గమనార్హం. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో సైతం సహజం కంటే ఆపరేషన్లు అధికంగా ఉండటం కలవరపెడుతోంది.

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: దుత్తలూరు, వెంకటాచలం, న్యూస్‌టుడే:

జిల్లాలో వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) పరిధిలో 13 ఆసుపత్రులు ఉండగా- వీటిలో 10 సామాజిక(సీహెచ్‌సీ), 2 ప్రాంతీయ, 1 జిల్లా ఆసుపత్రి ఉన్నాయి. నాడు-నేడు పథకంలో 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను 50 నుంచి 100కు ఉన్నతీకరించారు. పెంచిన పడకలకు అనుగుణంగా ప్రసూతీ(గైనకాలజీ), మత్తు (ఎనస్తీషియా), చిన్నపిల్లల(పీడియాట్రిక్‌) వైద్య నిపుణులను నియమించినా.. ప్రసూతీ సేవల విషయంలో సర్కారు ఆసుపత్రులు సంతృప్తి కలిగించలేకపోతున్నాయి. ప్రసవాల కోసం గర్భిణులు ఇంకా ప్రైవేటు ఆసుపత్రుల వైపే చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు నెలకు 30 నుంచి 350 ప్రసవాలు నిర్దేశించినా.. అందులో సగమైనా చేరుకోవడం లేదు. రూ.కోట్లతో వైద్యశాలలను అభివృద్ధి చేసినా.. వైద్య నిపుణులందరినీ నియమించినా.. నిర్దేశించిన సేవలందించడంలో వెనుకడుగే కనిపిస్తోంది. కొన్నిచోట్ల పరీక్షించి.. ఏదో ఒకసాకు చెప్పి ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు పంపిస్తుండటంతో సర్కారు లక్ష్యం నీరుగారుతోంది.

ఇదీ సేవల తీరు

* కావలి ప్రాంతీయ ఆసుపత్రిలో 100 పడకలు ఉండగా- నెలకు 200 వరకు ప్రసవాలు జరగాలని లక్ష్యంగా పెట్టారు. ఏ నెలా ఇక్కడ వంద కూడా దాటలేదు. గత జనవరిలో 68, ఫిబ్రవరిలో 57 జరిగాయి. ఇక్కడ పనిచేస్తున్న కొందరు డాక్టర్లు ప్రైవేటులో పని చేస్తుండటంతో.. ఇక్కడకు వచ్చే వారిని అక్కడికి పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి ఓ గర్భిణిని ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సంప్రదించారు. ప్రైవేటులో చేరడానికి కారణం ఏమిటని అడగ్గా.. ఆశా కార్యకర్త తీసుకువచ్చారని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆ విషయాన్ని సర్దుబాటు చేశారు.

* వెంకటాచలం సామాజిక ఆసుపత్రికి 9 నెలల కిందట సీహెచ్‌సీగా, మూడు నెలల క్రితం 24 గంటల ఆసుపత్రిగా మార్చారు. ఎనిమిది మంది వైద్యులు, అయిదుగురు నర్సులు, ఇతర సిబ్బందిని నియమించినా.. ఒక్కరూ కనిపించరు. ఇక్కడ నెలకు 30 ప్రసవాలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా- గత ఏడాది కాలంలో కేవలం 34 చేశారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ‘ఈనాడు’ పరిశీలించగా- ఇద్దరు నర్సులు మాత్రమే ఉన్నారు. వైద్యులు అందుబాటులో లేరు. ఈ పరిస్థితుల వల్లనే చుట్టుపక్కల ప్రజలు నెల్లూరు వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

* వింజమూరు సీహెచ్‌సీలో 50 పడకలు ఉండగా- ఇక్కడ నెలకు 30 కాన్పులు చేయాల్సి ఉన్నా.. గత ఏడాదిలో 41 మాత్రమే చేశారు. ఇందులో 36 సాధారణం, 5 శస్త్రచికిత్సలు. అన్ని వసతులు కల్పించినా.. వైద్యులు అవగాహన కల్పించకపోవడంతో పాటు ప్రైవేటుకు సూచిస్తున్నారని.. డబ్బు చెల్లించే స్థోమత లేదని చెప్పిన వారిని ఆత్మకూరు ఆసుపత్రికి పంపిస్తున్నట్లు తెలిసింది. ః ఇందుకూరుపేట, అల్లూరుల్లోనూ ఇదే పరిస్థితి. రాపూరు, కోవూరు, ఉదయగిరి, పొదలకూరు ప్రాంతాల్లో కాన్పులు లక్ష్యం చేరుకోలేదు. సగటున 15 నుంచి మాత్రమే చేయగలుగుతున్నారు. తగినంత మంది వైద్యనిపుణులన్నా పెంచలేకపోతున్నారు.

వెంకటాచలం పీహెచ్‌సీలో అందుబాటులో ఉన్న సామగ్రి


నమ్మకం కల్పించకనే..!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య నిపుణులు 24 గంటలూ అందుబాటులో ఉంటారనే నమ్మకం కలిగించలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ.. ప్రైవేటు క్లినిక్‌లలో సేవలకే కొందరు పరిమితం కావడంతో ప్రసూతీ సేవలు దారి తప్పుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల సర్కారు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స చేయించుకోవడానికి సొమ్ములు చెల్లించాల్సిన పరిస్థితి ఉండగా- ఆ డబ్బులేవో ప్రైవేటులో ఇచ్చుకుంటే.. మెరుగైన వైద్యం అందుతుందని వెళ్లిపోతున్న వారూ ఉన్నారు. సర్కారు ఆసుపత్రుల్లో కాన్పు అయితే.. కొన్నిచోట్ల ఆరోగ్యశ్రీలో నమోదు చేయడం లేదు. ఫలితంగా ఆసరా సాయం అందడం లేదు. అదే ప్రైవేటులో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. దీంతో చాలా మంది అటువైపు వెళ్లిపోతున్నారు. ఈ కారణాలతోనే ప్రభుత్వ వైద్యశాలలు ప్రసన లక్ష్యానికి దూరంగా ఉండిపోతున్నాయి.


లక్ష్యాలు చేరుకుంటాం

పెంచలయ్య, డీఎంహెచ్‌వో

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్దేశించిన మేరకు ప్రసవాలు జరిగేలా చూస్తాం. తరచూ నిర్వహించే సమీక్షల్లో వైద్యులకు సూచిస్తున్నాం. ఇటీవల కాలంలో అన్నిచోట్ల పూర్తిస్థాయిలో నిపుణులను నియమించారు. కాన్పుల సంఖ్య పెంచడానికి అవకాశం ఉంది. సాధారణ ప్రసవాలు చేయాలని అవగాహన కల్పిస్తున్నాం. అవసరం లేకున్నా శస్త్రచికత్సలు చేసినట్లు తెలిస్తే తగు చర్యలు తీసుకుంటాం.


ఇదీ పరిస్థితి

మొత్తం కాన్పులు  27,237
ప్రభుత్వ ఆసుపత్రుల్లో  8,672
ప్రైవేటులో   18,565
సిజేరియన్లు  80 శాతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని