logo

పది పరీక్షలకు సమాయత్తం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనుండగా- యంత్రాంగం సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమైంది.

Published : 24 Mar 2023 05:14 IST

172 కేంద్రాల్లో నిర్వహణ

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనుండగా- యంత్రాంగం సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమైంది. కరోనా నేపథ్యంలో గత మూడేళ్లుగా పరీక్షలు సవ్యంగా నిర్వహించలేదు. మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలను అనుకున్న సమయానికే తెరిచారు. తరగతుల నిర్వహణ ద్వారా సిలబస్‌ సైతం పూర్తి చేశారు. ఆ నేపథ్యంలో పరీక్షల పకడ్బందీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సమీక్షలు, సిబ్బందికి శిక్షణ పూర్తయ్యాయి.

29,401 మంది హాజరు

జిల్లా వ్యాప్తంగా 29,401 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుండగా- 172 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 14ను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్‌, డీఆర్వోలు విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. డీఈవో గంగాభవాని ఉన్నత స్థాయి సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇన్విజిలేటర్లను నియమించాల్సి ఉంది. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్‌, విద్యుత్తు, వైద్యఆరోగ్యశాఖ తదితర శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించారు.

24, 25 తేదీల్లో ప్రశ్నపత్రాల రాక

పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా కేంద్రానికి చేరుతాయని విద్యాశాఖాధికారులు తెలిపారు. వాటిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచి.. బందోబస్తు మధ్య ఆయా పరీక్ష కేంద్రాలు ఉన్న పోలీసు స్టేషన్లకు చేరవేయనున్నారు.


పకడ్బందీగా నిర్వహణ

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నాం. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా.. ప్రశాంత వాతావరణంలో రాసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

ఆర్‌.ఎస్‌.గంగాభవాని, డీఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని