logo

ఎన్నికా.. ఏకగ్రీవమా!

స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నెల్లూరు రెడ్‌క్రాస్‌ పాలకవర్గం ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Published : 26 Mar 2023 03:05 IST

నేడు రెడ్‌క్రాస్‌ సర్వసభ్య సమావేశం

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నెల్లూరు రెడ్‌క్రాస్‌ పాలకవర్గం ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు జరుగుతాయా? ఏకగ్రీవంగా ఛైర్మన్‌ను ఎన్నుకుంటారా? అన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆదివారం నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధ్యక్షతన జరిగే సర్వసభ్య సమావేశంలో ఈ విషయం ప్రధానంగా చర్చకు రానుందని సమాచారం. ఎన్నికలు లేకుండా పాలకవర్గాన్ని ఎన్నుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆ మేరకు శాశ్వత సభ్యులతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఛైర్మన్‌గా వ్యవహరించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ క్రమంలో ఛైర్మన్‌ రేసులో ఎవరున్నారు? అనే విషయం పరిశీలిస్తున్నారు. ఏకగ్రీవమైతే చంద్రశేఖర్‌రెడ్డినే మరోసారి ఎన్నుకునేందుకు అవకాశం ఉందని కొందరు సభ్యులు చెబుతున్నారు. దీనిపై ఆదివారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది జరిగితే.. అదే రోజు కొత్త ప్యానల్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

గతంలో హోరాహోరీ.. 2020లో రెడ్‌క్రాస్‌ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. అప్పుడు సుమారు 4,871 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. ఛైర్మన్‌తో పాటు.. 15 మంది సభ్యులకు జరిగే ఎన్నికలకు 46 మంది పోటీ చేశారు. వారిలో 16 మంది స్వతంత్ర అభ్యర్థులు కాగా.. మిగిలిన 30 మంది రెండు ప్యానెళ్లుగా ఏర్పడ్డారు. రెడ్‌క్రాస్‌ సేవా ప్యానల్‌ విజయం సాధించడంతో చంద్రశేఖర్‌రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 15 మంది సభ్యుల్లో ఇద్దరు మరణించగా.. ఒకరి గుర్తింపు రద్దయింది. ఈ మూడేళ్లలో శాశ్వత సభ్యులను విపరీతంగా చేర్చారు. ప్రస్తుతం ఏడువేల మందికిపైగా ఉన్నారు. దీంతో ఎన్నికలు జరిగినా.. రెడ్‌క్రాస్‌ సేవా ప్యానల్‌ విజయం సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో పోటీ చేసిన సభ్యుల్లో చాలా మంది ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు.

ఎన్నికలైతే...ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగితే.. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 1గంట వరకు కస్తూర్బా కళాక్షేత్రంలో నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2 తర్వాత పరిశీలన, తుది జాబితా ప్రకటిస్తారు. సాయంత్రం 5 నుంచి ఉపహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఏప్రిల్‌ 2వ తేదీ ఉదయం 8 నుంచి 2 గంటల వరకు నెల్లూరు నగరంతో పాటు.. జిల్లాలోని అన్ని బ్రాంచ్‌లకు ఎన్నికలు నిర్వహిస్తారు. 3వ తేదీ నెల్లూరులోని రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు లెక్కింపు అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. గెలుపొందిన వారిలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, ట్రెజరర్‌ పదవుల కోసం పోటీ ఉంటే.. 4వ తేదీ ఎన్నిక నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని