logo

Nellore: అప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గు.. ఇప్పుడు ఆ ముగ్గురూ ఒక్కటయ్యారు!

ఉదయగిరి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ పార్టీల నుంచి తలపడిన నేతలు వారు.. ఒకప్పుడు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుండేవి.

Updated : 23 May 2023 11:14 IST

ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ నివాసంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు

ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరి నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో గెలుపు కోసం వివిధ పార్టీల నుంచి తలపడిన నేతలు వారు.. ఒకప్పుడు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులుండేవి. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కీలకమైన ముగ్గురు నేతలు ఒకేచోట కనిపించి స్థానికులను ఆశ్చర్యపరిచారు. నాటి ప్రత్యర్థులు ప్రస్తుతం మిత్రులుగా ఒకే వేదికపై దర్శనమివ్వటం చర్చనీయాంశమైంది. వారే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, కంభం విజయరామిరెడ్డి.

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌, వైకాపాల నుంచి ఆరుసార్లు పోటీచేసి నాలుగుసార్లు విజయం సాధించారు. కంభం విజయరామిరెడ్డి ఐదుసార్లు తెదేపా, ఒక్కసారి స్వతంత్ర, ఒకసారి కాంగ్రెస్‌ నుంచి మొత్తం ఏడుసార్లు పోటీ చేశారు. ఇందులో రెండుసార్లు విజయం సాధించారు. బొల్లినేని వెంకట రామారావు 2012 ఉప ఎన్నికల నుంచి తెదేపా తరఫున మూడుసార్లు పోటీచేశారు. ఒక్కసారి విజయం సాధించారు. మండల పరిధి గానుగపెంటపల్లి గ్రామంలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొనేందుకు సోమవారం ఆ ముగ్గురు వచ్చారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ మన్నేటి వెంకటరెడ్డి నివాసంలో ఒకేచోట కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు. వారితోపాటు దివంగత మాజీ ఎమ్మెల్యే పొన్నెబోయిన చెంచురామయ్య తనయుడు జడ్పీ మాజీ ఛైర్మన్‌ చెంచలబాబుయాదవ్‌ కూడా ఉన్నారు. నాటి ప్రత్యర్థులు నేడు మిత్రులుగా ఒకేచోట కనిపించటంతో ఇది కదా.. రాజకీయమంటే అని ఉదయగిరిలో పలువురు చర్చించుకోవటం కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని