logo

నర్రవాడలో.. పర్యాటకానికి అడుగులు

దుత్తలూరు మండలం నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి.

Published : 09 Jun 2023 02:15 IST

ఆర్డీవో స్థల పరిశీలన

నర్రవాడ వద్ద జాతీయ రహదారి పక్కన స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో శీనానాయక్‌

దుత్తలూరు, న్యూస్‌టుడే: దుత్తలూరు మండలం నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు దేవస్థానాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుండగా- ప్రతి గురు, ఆదివారాల్లో భక్తులు అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఇటీవల కాలంలో హోమగుండం, అన్నదాన సత్రం, కల్యాణ మండపం, దుకాణ సముదాయాలు, క్యూలైన్లు.. ఇలా ఒక్కో వసతి సమకూరగా.. ఆ క్రమంలోనే నర్రవాడ క్షేత్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దితే మరింతగా అభివృద్ధి చెందుతుందంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. నర్రవాడ పరిసరాల్లో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి.. ఆ ప్రాంతంలో హరిత రిసార్ట్స్‌తో పాటు భక్తులకు సేదతీరే సౌకర్యాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ తదితరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు.

ఉన్నతాధికారులకు నివేదిక

ఆ క్రమంలోనే గురువారం కావలి ఆర్డీవో శీనానాయక్‌ నర్రవాడ బైపాస్‌ వద్ద ఉన్న 22 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. జాతీయ రహదారి పక్కనే ఉండటం.. పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అనువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. స్థల పరిశీలన అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ.. స్థలానికి సంబంధించి పూర్తి వివరాలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.

బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష

దుత్తలూరు, న్యూస్‌టుడే: అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ నెల 11 నుంచి జరిగే వెంగమాంబ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీవో శీనానాయక్‌ కోరారు. గురువారం ఆయన స్థానిక దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఆలయ ధర్మకర్త పచ్చవ కరుణాకర్‌, కార్యనిర్వహణాధికారి ఉషశ్రీ, తహసీల్దారు సోమ్లా నాయక్‌, డీఎల్‌పీవో మాధవీలత, ఎంపీడీవో సాయిప్రసాద్‌ పాల్గొన్నారు.

ఉపాధికీ అవకాశాలు

వెంగమాంబ దేవస్థానం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవారి భక్తులకు మేలు జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థల పరిశీలన జరిగింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాం.

పచ్చవ కరుణాకర్‌, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు