logo

జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం

Published : 28 Mar 2024 04:27 IST

అయిదేళ్లుగా పట్టించుకోని వైకాపా ప్రభుత్వం

 

న్యూస్‌టుడే, కోవూరు: జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యం గల మిథాని పరిశ్రమ నాలుగున్నరేళ్లుగా పునాదులకే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.మూడు వేల కోట్లతో ఏర్పాటు చేయాలని భావించింది. అప్పటి తెదేపా ప్రభుత్వం ఏపీఐఐసీˆ ద్వారా 206 ఎకరాలు సేకరించి పరిశ్రమ ప్రతినిధులకు అందించారు. అప్పటి నుంచి పనులు అరకొరగా కొనసాగుతున్నాయి. పరిశ్రమ ఏర్పాటైతే నేరుగా సుమారు పది వేల మందికి సంఘటిత రంగంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్నా పరిశ్రమ పురోగతి లేక పునాదులకే పరిమితవడంతో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయి.

2018లో భూములు కేటాయించినా...

1972వ సంవత్సరంలో అప్పటి కలెక్టరు శంకరన్‌  కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాళెం రెవెన్యూ పరిధిలోని చంద్రశేఖరపురం వద్ద భూములు లేని నిరుపేద దళిత, గిరిజనులకు ఒక్కొక్కరికి ఎకరాచొప్పున సీˆజేఎఫ్‌ఎస్‌ పట్టాలిచ్చారు. కనిగిరి రిజర్వాయర్‌ నుంచి కాలువల ద్వారా భూములకు సాగునీరు సరఫరా చేయడంతో దళిత, గిరిజనులు సాగుచేసుకొని జీవనం సాగించారు. కాలక్రమంలో  సాగునీరు సక్రమంగా అందకపోవడంతో భూములు బీళ్లుగా మారాయి. వారంతా బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.. 2004లో కేంద్ర జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఇక్కడి రైతులకు గుత్తేదారులు ఎలాంటి సమాచారమివ్వకుండా యాభై ఎకరాల్లో గ్రావెల్‌ తరలించారు. దీంతో భారీ గుంతలేర్పడి సాగు చేసేందుకు వీల్లేకుండా పోయింది. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు  ఇదే భూముల్లో గ్రావెల్‌ తవ్వకాలు జరిగాయి.  మరో 20 ఎకరాల్లో గిరిజన బాలికల గురుకులాన్ని నిర్మించారు. పెయ్యలపాళెంలో 50 ఎకరాలు అక్కడి నిరుపేదలు సాగుచేసుకొని జీవిస్తున్నారు. మిగిలిన సుమారు 206 ఎకరాల్లో మిథాని పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు తెదేపా ప్రభుత్వం 2018లో భూములు కేటాయించింది. లబ్ధిదారులకు ఎకరాకు రూ.6 నుంచి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం పరిశ్రమ పురోగతిపై శ్రద్ధ వహించలేదని నిరుద్యోగులు వాపోతున్నారు.

నిరుద్యోగుల ఆశలు ఆవిరి..

పరిశ్రమ పనులు పూర్తయి ఉంటే జిల్లాకే తలమానికంగా ఉండేదని అధికారులు చెబుతున్నారు. వేలాది మందికి ఉద్యోగాలొచ్చే అవకాశం ఉండటంతో పాటు అనుంబంధంగా వందలాది చిన్న, మద్యతరగతి పరిశ్రమలు ఏర్పాటయ్యేవి.  నెల్లూరు నగరం నుంచి కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే జాతీయ రహదారి పక్కనే చంద్రశేఖరపురం వద్ద మిథాని పరిశ్రమ ఏర్పాటుతో ఎంతో ప్రయోజకరంగా ఉండేది.  మరోవైపు రైల్వే లైను కూత వేటు దూరంలో ఉంది. కృష్ణపట్నం ఓడరేవు 45 కిలోమీటర్ల పరిధిలో ఉన్నందున పరిశ్రమలో తయారైన సామగ్రి దేశ, విదేశాలకు సులువుగా తరలించే అవకాశముంది. ఇన్ని మెరుగైనా అవకాశాలున్నా ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమ స్థాపనలో శ్రద్ధ చూపకపోవడం వల్లనే మిథాని పరిశ్రమ పునాదుల దశ దాటలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని