logo

ఆర్‌ఐ రోడ్డుకు జగన్‌ పోటు

తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది.

Published : 20 Apr 2024 04:43 IST

2 లక్షల మందికి నరకం
నాటి పనులను నిలిపేసిన ప్రభుత్వం

ఇస్కపల్లి రోడ్డు దుస్థితి

తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. గత తెదేపా ప్రభుత్వంలో మంజూరైన పని కావడంతో గుత్తేదారుకు బిల్లులు నిలిపేసింది. అడుగడుగునా గోతులు పడినా అయిదేళ్లుగా చారెడు మట్టి పోయలేదు. దీంతో ప్రమాదకరంగా మారిన మార్గంలో రెండు లక్షల మందికిపైగా ప్రజలు అగచాట్లు పడుతున్నారు. ఇదీ రాజుపాలెం- ఇస్కపల్లి(ఆర్‌.ఐ) రోడ్డు పరిస్థితి.

న్యూస్‌టుడే, అల్లూరు

జిల్లా కేంద్రమైన నెల్లూరు నుంచి రాజుపాలెం మీదుగా ఇస్కపల్లి వెళ్లేందుకు ఆంగ్లేయుల కాలంలో రహదారి నిర్మించారు. దీనిమీదుగా బోగోలు, అల్లూరు, విడవలూరు, కొడవలూరు మండలాల వారు రాకపోకలు సాగిస్తుంటారు. నాటి అవసరాల మేరకు సింగిల్‌ లైనుగా వేశారు. తీరంలో మత్స్య, ఉప్పు పరిశ్రమలు వృద్ధి చెందాయి. ఆయా సంస్థల వాహనాలతో పాటు బస్సులు, వ్యక్తిగత వాహనాల రద్దీ భారీగా పెరగడంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈనేపథ్యంలో రెండు వరుసలుగా మార్చేందుకు గత తెదేపా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిధులు మంజూరయ్యాయి. ఈపనులు ప్రారంభించే లోపు ఎన్నికలు జరగడంతో వైకాపా అధికారంలోకి వచ్చింది. నిధులు ఉన్నా పనులు చేయించడంలో నిర్లక్ష్యం వహించారు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. కానీ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. అయిదేళ్లుగా మరమ్మతులు లేకపోవడంతో రహదారి ఛిద్రమైంది.  

కేంద్ర స్థాయి నాయకులున్నా..

రోడ్డు గుంతలుగా మారటంతో ప్రయాణం కష్టంగా మారింది. ఈ ప్రాంత వాసులైన మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకరరెడ్డి, బీద మస్తాన్‌రావు ఉన్నా ఈరహదారి బాగుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు.

అదనంగా ఇంధనం ఖర్చవుతోంది

శ్రీనివాసులు, అల్లూరుపేట

అల్లూరు నుంచి నెల్లూరుకు పోవాలంటే అదనంగా ఇంధనం అవుతోంది.  కారుకు రెండు లీటర్లు అదనంగా పోయాల్సి వస్తోంది. ఇందుకు రూ.200లకు పైగా ఖర్చవుతోంది. అయిదేళ్లుగా అవస్థలు పడుతున్నాను.  

ఆటో విక్రయించా:  జిలానీ, అల్లూరు

ఆటో నడిపి జీవనం సాగించేవాడిని. రోడ్డు కారణంగా తరచూ  మరమ్మతులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. నా ఆదాయం అంతా దీటికే సరిపోతోంది. కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఆటో విక్రయించి కూలి పనులకు పోతున్నాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని