logo

తెదేపా ఏజెంట్ గెంటివేతపై విచారణ

సర్వేపల్లి నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రంలో తెదేపా ఏజెంట్‌గా ఉన్న సండి రమేశ్‌ను అక్కడి నుంచి పోలీసులు గెంటేసిన సంఘటనపై మంగళవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

Published : 08 May 2024 06:40 IST

విచారణకు వచ్చిన అదనపు ఎస్పీ సౌజన్య

వెంకటాచలం, న్యూస్‌టుడే: సర్వేపల్లి నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కేంద్రంలో తెదేపా ఏజెంట్‌గా ఉన్న సండి రమేశ్‌ను అక్కడి నుంచి పోలీసులు గెంటేసిన సంఘటనపై మంగళవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వెంకటాచలం క్యూబా ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడు రోజులుగా సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరుగుతోంది. అక్కడ తెదేపా అభ్యర్థికి  వెంకటాచలానికి చెందిన రమేశ్‌ సోమవారం ఏజెంట్‌గా ఉండగా..  కేసులు ఉన్నాయని, ఎన్నికల అధికారి చెప్పారంటూ పోలీసులు అతడిని బలవంతంగా బయటకు పంపారు. ఈ విషయాన్ని సోమిరెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లగా.. మరోవైపు రమేశ్‌ కలెక్టర్‌కు, సర్వేపల్లి ఎన్నికల అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం సాయంత్రం ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి కళాశాలకు వచ్చారు. సదరు ఏజెంట్‌ను పిలిపించి విచారించారు.  సోమవారం జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ అధికారులు, పోలీసులను విచారించారు. సీసీ కెమెరాలు పరిశీలించారు.

సమాచారం  ఇవ్వకుండానే...

పోలింగ్‌ జరిగే సమయంలో ఎన్నికల అధికారులు ఆయా అభ్యర్థులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. మంగళవారం తెదేపా అభ్యర్థికి సమాచారం ఇవ్వకుండానే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉద్యోగుల కోసం క్యూబా ఇంజినీరింగ్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. అత్యవసర సర్వీసుల(ఫైర్‌, నౌకాదళం, మిలటరీ, ఎయిర్‌ఫోర్స్‌) విభాగాల్లోని ఉద్యోగులు 16 మంది ఉండగా.. వారి కోసం వెంకటాచలం తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం ఓటింగ్‌ నిర్వహించారు. అధికారులు ఆ విషయాన్ని బరిలో ఉన్న అభ్యర్థులకు తెలపలేదు. తొమ్మిది మంది ఓటు వినియోగించుకున్న తర్వాత తెదేపా ఏజెంట్లకు చెప్పారు. దానిపై వారు అధికారులను నిలదీశారు. సగానికి పైగా పోలింగ్‌ అయిన తర్వాత చెప్పడం ఏమిటని నిలదీశారు. పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లలేదు. దీనిపై కలెక్టర్‌తో పాటు, జిల్లా పరిశీలకులు, ఆర్వోకు ఫిర్యాదు చేసినట్లు తెదేపా ఏజెంట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు