logo

ప్రశ్నించడమే నేరం.. అరాచకానికి ఊతం

వైకాపా పాలనలో ఆగడాలు, ఆరాచకాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. వాటిని ప్రశ్నించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులపై అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులతో చెలరేగిపోయారు.

Published : 08 May 2024 07:02 IST

ప్రతిపక్ష నాయకులపై యథేచ్ఛగా వేధింపుల పర్వం
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో ఉదంతాలు
ఈనాడు, నెల్లూరు: కందుకూరు పట్టణం, కావలి, ఆత్మకూరు, న్యూస్‌టుడే

వైకాపా పాలనలో ఆగడాలు, ఆరాచకాలు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. వాటిని ప్రశ్నించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులపై అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులతో చెలరేగిపోయారు. ‘అధికారం మా చేతిలో ఉంది. యంత్రాంగం మేం చెప్పినదానికల్లా తలాడిస్తారు.. మాకు అడ్డేముంది’ అని రెచ్చిపోగా.. వాటిని అరికట్టాల్సిన పోలీసులు.. వారికే వంతపాడారు. బాధితులపైనే ప్రతాపం చూపించారు. ఈ అయిదేళ్లలో ఈ తరహా సంఘటనలు కోకొల్లలు.  

  • రెవెన్యూశాఖ భూముల్లో వైకాపా నాయకులు అడ్డగోలుగా గ్రావెల్‌ తరలించుకుపోతున్నా పట్టించుకోరేమంటూ కావలి తెదేపా నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు ఆందోళన చేశారు. దీనిపై కక్ష బూనిన అధికార పార్టీ నాయకులు.. డిప్యూటీ తహసీల్దారుతో ఫిర్యాదు చేయించారు. దాంతో మాలేపాటితో సహా.. పలువురిపై కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

తహసీల్దారు కార్యాలయంలో ఆందోళన చేస్తున్న  మాలేపాటి తదితరులు


సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారని..

కందుకూరు మండలం కొండముడుసుపాలేనికి చెందిన ఓ వ్యక్తి.. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట అమరావతిని వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని, కరోనా సమయంలో డాక్టర్‌ సుధాకర్‌ను వేధించిన విషయం,  ప్రజా వేదిక కూల్చివేత వంటి అంశాలపై నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టగా.. అప్పటి గ్రామీణ ఎస్సై.. పోలీసు స్టేషన్‌కు పిలిపించి వేధించారు.


దాడి చేసి.. ఆపై అట్రాసిటీ కేసు

కావలి పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్‌ మలిశెట్టి విజయలక్ష్మి తన అభిమాన నేత చంద్రబాబును ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టినందుకు వైకాపా శ్రేణులు కక్షబూని వేధించాయి. ఆమె భర్త కావలి మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌, తెదేపా రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు కార్యాలయంపై ఓ రోజు రాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దాడి జరిగే ముందు.. డిస్కం అధికారులపై ఒత్తిడి తెచ్చి.. విద్యుత్తు సరఫరా నిలిపివేయించారు. దాడుల అనంతరం విచిత్రంగా మలిశెట్టిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

  • జిల్లాలో జరిగిన అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొన్నారంటూ.. కావలికి చెందిన దివ్యాంగుడు తాళ్లూరు చిన్న మాల్యాద్రిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ యాత్ర జరిగిన రోజుల్లో తాను స్థానికంగా కూడా లేనని బాధితుడు ఎంత వేడుకున్నా.. పట్టించుకోని పోలీసుశాఖ.. నోటీసులు జారీ చేసింది.

  • ఏటి కాలువ పనుల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు నీటిపారుదలశాఖ ఎస్‌ఈ అధికారులతో కలిసి ఆత్మకూరు మండలం బట్టేపాడు, అప్పారావుపాళెం వచ్చారు. విషయం తెలుసుకున్న వైకాపా నాయకులు.. అక్కడకు వచ్చి వివాదం రేపారు. కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదిదారుడు మల్లికార్జుననాయుడుపై కేసు పెట్టించారు. ఎలాంటి విచారణ లేకుండానే పోలీసులు దాన్ని నమోదు చేశారు.

కరేడు చెరువులో మట్టి తవ్వకాలు అడ్డుకుంటున్న ఇంటూరి నాగేశ్వరరావు, నాయకులు(పాతచిత్రం)

ఉలవపాడు మండలం కరేడు చెరువులో గత ఏడాది ఆగస్టులో వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వి.. భారీ టిప్పర్లతో తరలిస్తున్నారు. స్థానికుల ద్వారా ఆ సమాచారం అందుకున్న కందుకూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు అక్కడికి వెళ్లి వాటిని అడ్డుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల ఆయకట్టు రైతులకు కలిగే ఇబ్బందులపై నిలదీశారు. దీనిపై నాగేశ్వరరావుతో పాటు పలువురు తెదేపా నాయకులపై కేసు నమోదు చేశారు.


మాజీ మంత్రి నారాయణపై..

తనిఖీల సందర్భంగా వైద్య కళాశాలలోకి వెళ్లేవారిని అడ్డుకుంటున్న పోలీసులు (పాతచిత్రం)

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ మంత్రి నారాయణను వేధింపులకు గురి చేసింది. రాజధాని అంశంతో పాటు అయిదేళ్లలో ఆయనపై 8 కేసులు నమోదు చేయించారు. చివరకు ఎన్నికల్లో ఇబ్బంది పెట్టేందుకు పోలీసుల సాయంతో దాడులు చేయించారు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు సాయం చేసేవారినీ భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ ఔషధ నియంత్రణ అధికారుల పేరుతో నెల్లూరులోని నారాయణ వైద్యకళాశాల, ఆయన నివాసంలో తనిఖీలు చేసి.. చివరకు ఏం లేవని తేల్చారు. ఏప్రిల్‌లో మరోసారి నారాయణకు తెలిసిన జడ్పీటీసీ మాజీ సభ్యురాలు ముప్పాళ్ల విజేతారెడ్డి, ఆయన కళాశాలలో పనిచేసే రమణారెడ్డి, శ్రీధర్‌, విశ్వసేనారెడ్డి, సురేష్‌, గిరిష్‌కుమార్‌, బోయిళ్ల ప్రసాద్‌ తదితరులతో పాటు వైద్య కళాశాలలో పనిచేసే డాక్టర్‌ సంపత్‌ ఇళ్లలో సోదాలు చేశారు. నారాయణకు అనుకూలంగా ఉంటున్నారనే ఉద్దేశంతో వ్యాపారవేత్త కోటా గురుబ్రహ్మం ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. చివరకు విలేకరుల సమావేశం పెట్టి.. పొంతన లేని విషయాలు వెల్లడించారు.


క్వార్ట్జ్‌ దోపిడీని అడ్డుకుంటే...

సోమిరెడ్డిని పరామర్శిస్తున్న పార్టీ నాయకులు

పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం వద్దనున్న రుస్తుం మైకా గనుల నుంచి వైకాపా నాయకులు అక్రమంగా రూ. కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను కొల్లగొట్టారు. విషయం తెలిసిన తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.. అక్కడకు వెళ్లి అక్రమ మైనింగ్‌ను పరిశీలించారు. ఆ దోపిడీని అడ్డుకోవాలని కలెక్టర్‌తో పాటు గనులశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో సోమిరెడ్డి అక్కడే నిరసన కార్యక్రమం చేపట్టారు. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదని దీక్షకు దిగగా... వైకాపా నాయకులు అక్కడికి హిజ్రాలను పంపి భగ్నం చేయాలని చూడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీనిపై ముందస్తు సమాచారం ఉన్నా.. పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు