logo

అధ్వాన దారులు.. పట్టని పాలకులు

తెదేపా హయాంలో మట్టి రోడ్డుగా ఉన్న తొడుగుపల్లెకు 16 ఏళ్ల కిందట తారు రోడ్డు వేశారు. అధ్వానంగా తయారవడంతో అయిదేళ్లుగా మరమ్మతులు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు. 

Published : 10 May 2024 04:27 IST

న్యూస్‌టుడే, వరికుంటపాడు

తెదేపా హయాంలో మట్టి రోడ్డుగా ఉన్న తొడుగుపల్లెకు 16 ఏళ్ల కిందట తారు రోడ్డు వేశారు. అధ్వానంగా తయారవడంతో అయిదేళ్లుగా మరమ్మతులు చేయాలని పాలకులకు విన్నవించినా పట్టించుకోలేదు.  అధ్వానంగా తయారైన రోడ్లపై ప్రయాణాలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, కలిగిరి, కొండాపురం, జలదంకి మండలాల్లోని లింకు రోడ్లు తారు లేచిపోయి గోతులతో దర్శనమిస్తున్నాయి.

  • భోగ్యంవారిపల్లె- చాకలికొండ వెళ్లే రోడ్డు కంకర బయటపడి గోతులతో దర్శనమిస్తోంది. కనియంపాడు- చాకలికొండకు వెళ్లే రోడ్డు రామదేవులపాడు, జనార్ధనపురం గ్రామాల మధ్య వాగుపై వంతెన లేకపోవడంతోపాటు కి.మీ మేర మట్టి రోడ్డుపై ప్రయాణాలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు.
  • కాకొల్లువారిపల్లె, హుస్సేన్‌నగర్‌, రామాపురం రింగురోడ్డు గత తెదేపా హయాంలో ప్రతిపాదనలు పంపగా తారురోడ్డుగా మంజూరైనా  గుత్తేదారు చేసేందుకు ముందుకు రాలేదు.
  • దుత్తలూరు మండలంలోని రాచవారిపల్లె- బైరవరం మార్గం 9 కి.మీ. తారు లేచిపోయి కంకర బయటపడింది. నర్రవాడ- కొత్తపేట రోడ్డు పరిస్థితి అలాగే ఉంది.ః వింజమూరు- గుండెమడుగు, వింజమూరు - నేరేడుపల్లి రోడ్లదీ ఇదే దారి.
  • సీతారామపురం మండలం రంగనాయుడుపలి- బాలాయపల్లి వెళ్లే రోడ్డు గోతులుగా దర్శనమిస్తోంది.
  • ఉదయగిరి- బండగానిపల్లి రోడ్డు అటవీ శాఖ అనుమతులు లేక అసంపూర్తిగా నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు.
  • కొండాపురం మండలం  కొండాపురం- కావలి ప్రధాన రహదారిలో రేణమాల బస్టాండు కూడలిలో గోతులమయమైంది.
  • జలదంకి మండలం సోడవరం- రామవరప్పాడు రహదారి తారు లేచిపోయి అధ్వానంగా ఉంది.  

నిత్యం ప్రమాదాలే

- నక్కల నాగార్జున, స్థానికుడు

రోడ్లు అధ్వానంగా ఉండడంతో ద్విచక్రవాహనాలపై ప్రయాణాలు సాగించేవారు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు.  ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారుతున్నా గ్రామీణ ప్రాంత రహదారులు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు.


హామీలతోనే సరిపెడుతున్నారు

- ధనేకుల నాగేంద్రబాబు, స్థానికుడు

ఎన్నికల సమయంలో మాత్రమే పాలకులకు మా గ్రామాలు కనిపిస్తాయి. ఆసమయంలో స్థానికులు వారి దృష్టికి తీసుకొస్తే పదవి చేపట్టిన వెంటనే చేస్తామని హామీలు ఇస్తారు. తరువాత పట్టించుకోరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని