logo

అదే మాట.. పాత హామీల మూట!

నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రత్యేక మ్యానిఫెస్టో, అందులోని అంశాలను చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Updated : 10 May 2024 05:37 IST

ప్రత్యేక మ్యానిఫెస్టో పేరుతో మరోసారి వైకాపా హడావుడి
గత అయిదేళ్లలో.. చేయలేక చేతులెత్తేసినవే ఎక్కువ

ఈనాడు, నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రత్యేక మ్యానిఫెస్టో, అందులోని అంశాలను చూసి జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచేందుకు.. ఈయన ‘నెల్లూరు ప్రత్యేక మ్యానిఫెస్టో’ రూపొందించి.. ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ అడిగినట్లుగానే ‘ఒక్క చాన్స్‌ ఇవ్వండి’ అంటూ ప్రజలను కోరుతున్నారు. 46 హామీలతో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి చేస్తానంటూ.. ఆయా అంశాలను డిజిటల్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. 2029 నాటికి నెల్లూరు ఇలా ఉంటుందంటూ త్రీడీ చిత్రాలు ప్రదర్శించారు. దాంతో గత అయిదేళ్ల వైకాపా పాలనలో జిల్లాకు వనగూరిన ప్రయోజనాలపై సామాన్యుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. నెల్లూరు అభివృద్ధిని విస్మరించినందుకా? సోమశిల ఆఫ్రాన్‌ పనులు పక్కన పెట్టి నందుకా?ముదివర్తి- ముదివర్తిపాళెం కాజ్‌వే పనులు చేపట్టనందుకా? ఇసుక, మట్టి, గ్రావెల్‌ దోచుకున్నందుకా? ప్రశ్నించిన వారిపై దాడులు..తిరిగి బాధితులపైనే కేసులు పెట్టినందుకా?ఇన్నీ చేసి.. ‘మళ్లీ మీరే ఎందుకు కావాలో’ ప్రజలకు వివరించే నైతికత ఎక్కడిదన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి ఉత్పన్నమవుతున్నాయి.


హామీ: సోమశిల హైలెవల్‌ కాలువను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం.. లక్ష ఎకరాలకు నీరు, 2.5 లక్షల మందికి తాగునీరిస్తాం
ప్రస్తుత పరిస్థితి: 2020 నవంబరు 9న సోమశిల హైలెవల్‌ కాలువ రెండో దశ పనులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆ సందర్భంగా... మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయిదేళ్లలో రూ. 180 కోట్ల విలువైన మట్టి పనులు చేశారు. ఇక  చేయలేమని గుత్తేదారు ఆపేయడంతో.. ఇటీవల బిల్లులు చెల్లించారు. అయినా పునః ప్రారంభించేందుకు ముందుకు రాలేదు.


మొగళ్లపాళెం వద్ద 150 ఎకరాల్లో రూ. 250 కోట్లతో ప్రపంచ శ్రేణి.. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం
నెల్లూరు గ్రామీణం మొగళ్లపాలెంలో మైదానం నిర్మాణానికి 150 ఎకరాలు సేకరించారు. అక్కడ 8 కోట్లతో 2018లో మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం ప్రారంభమైంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయిదేళ్లు పట్టించుకోలేదు. పూర్తయినట్లు ప్రకటించినా.. ప్రారంభం మాత్రం అప్పుడు ఇప్పుడూ అని దాట వేస్తుండగా- ఆ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం నెలకొంది.


నెల్లూరు లోక్‌సభ పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం.. కార్గో హబ్‌ ఏర్పాటు చేస్తాం..
గత ప్రభుత్వంలో రూ. 368 కోట్లతో దగదర్తి విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఎన్‌ఐఏపీఎల్‌ సంస్థకు టెండర్లు ఖరారు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. యాజమాన్య పద్ధతిలో ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తర్వాత తెట్టు అని.. మళ్లీ దగదర్తిలోనే అని రోజుకో మాట చెబుతున్నారు.


ముదివర్తి-ముదివర్తిపాళెం సబ్‌ మెర్సిబుల్‌ కాజ్‌వే రెండో దశ నిర్మాణం.. రూ. 130 కోట్ల వ్యయంతో..
మొదటి విడత పనులకే మూడేళ్లుగా టెండర్లు పిలుస్తున్నారు. ఎన్నికల ముందు రూ. 93.32 కోట్లతో పనులు చేస్తున్నట్లు చెప్పి.. హడావుడిగా మళ్లీ శంకుస్థాపన చేశారు. సరేలే అనుకుంటుండగా.. మళ్లీ ఆపేశారు. అయిదేళ్లలో మొదటి విడతకే దిక్కులేదు... రెండో విడతకు హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉంది.


కావలి పట్టణ శివారు ప్రాంతాలన్నింటినీ కలుపుతూ రింగ్‌ రోడ్డు
కావలి పట్టణంలోని ప్రధాన రహదారిని దాదాపు 8 కి.మీ. విస్తరించేందుకు రూ. 56 కోట్లతో మూడేళ్ల కిందట పనులు ప్రారంభించారు. ఆ తర్వాత చాలవని.. మరో రూ. 25 కోట్లు ప్రకటించారు. అయినా.. చేయలేమని గుత్తేదారు వెళ్లిపోయారు. ఒక్క రోడ్డు పూర్తి చేయలేని ప్రభుత్వం.. ఈసారి అధికారం రాగానే ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమని వైకాపా నాయకులే మాట్లాడుతుండటం గమనార్హం.


ఆత్మకూరు నుంచి సోమశిలకు, నందవరం -నందిపాడు, నెల్లూరుపాళెం- వింజమూరుకు రోడ్డు నిర్మాణం
ఈ రోడ్లన్నీ.. గడిచిన మూడేళ్లుగా అధ్వానంగా ఉన్నాయి. కనీస మరమ్మతులు చేయలేదు. ఎన్నికల ముందు హడావుడిగా నందవరం రోడ్డు పనులు ప్రారంభించి.. రోడ్డు తవ్వి వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వింజమూరు రోడ్డు పరిస్థితి అంతే.. ఆత్మకూరు- సోమశిల రోడ్డు గుంతలతో అధ్వానంగా ఉంది. మళ్లీ వస్తే వీటిని పూర్తి చేస్తారట!


నెల్లూరు నగరానికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తాం..
ప్రస్తుత పరిస్థితి: నెల్లూరు నగరం చుట్టూ బాహ్య వలయ రహదారి నిర్మించాలని గత ప్రభుత్వంలో ప్రణాళిక చేయగా.. 2022లో డీపీఆర్‌ తయారీకి నుడా అధికారులు టెండర్లు పిలిచారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో.. అడుగు పడలేదు.  దీంతో ఇదంతా రియల్‌ ఎస్టేట్‌ భూముల ధరలు పెంచుకునేందుకే అనే ప్రచారమూ జరిగింది.


సోమశిల ఊసేదీ?

2020, 2021లో వరద నష్టాలు.. అవి జిల్లాను వణికించిన తీరును ప్రజలు ఇంకా మరువలేదు. వాటి పరిశీలనకు వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమశిల, ఇతర వరద రక్షణ పనులకు రూ.120 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ విరామానంతరం రూ. 22కోట్ల మేర పనులు చేసినా.. బిల్లులు రాక గుత్తేదారు ఆపేశారు. ఈ సారి భారీ వరదలు వస్తే.. పరిస్థితి ఏమిటన్న తలంపే వణికిస్తోంది. ఇంత కీలకమైన విషయాన్ని వైకాపా ప్రత్యేక మ్యానిఫెస్టోలో ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమవుతోంది. అయిదేళ్లుగా ఒక్క పరిశ్రమనూ జిల్లాకు తీసుకురాని ప్రభుత్వం.. మళ్లీ అధికారంలోకి వస్తే నెల్లూరును టెక్‌హబ్‌గా మారుస్తామని, ఐటీ పార్కు ఏర్పాటు చేసి.. నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్న మాటలు ఎలా చెబుతోందని ప్రశ్నిస్తున్నారు. కావలి దగ్గర ఇండస్ట్రీయల్‌ పార్క్‌కు భూసేకరణ పూర్తిచేయలేదు గానీ.. బిట్రగుంటలో 1800 ఎకరాల్లో మెగా ఇండస్ట్రీయల్‌ పార్కు ఏర్పాటు చేసి.. 30వేల మందికి ఎలా ఉపాధి కల్పిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.


‘రాజకీయ నాయకుడికి విలువలు- విశ్వసనీయత ఉండాలి. మాట ఇస్తే నిలుపుకోవాలి.. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేయాలి’
ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల ముందు ఊరూరా తిరుగుతూ చెప్పిన మాటలివి. కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాటలు గాలికి వదిలేశారు. పాదయాత్రలో, తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జిల్లాపై కురిపించిన వరాలు మరిచిపోయారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాళ్లపాడు ప్రాజెక్టు అభివృద్ధి, కందుకూరుకు సోమశిల ఉత్తర కాలువ నీరు, నిమ్మ రైతులకు గిట్టుబాటు ధర.. ఆర్య వైశ్యుల చేతికే సత్రాల నిర్వహణ, కొడవలూరు కిసాన్‌ సెజ్‌లో ఇఫ్కో పరిశ్రమ ఏర్పాటు, ముదివర్తిపాళెం కాజ్‌వే నిర్మాణం, పెన్నా డెల్టా ఆధునికీకరణ, రూ. 100 కోట్లతో భగత్‌సింగ్‌ నగర్‌ వద్ద రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, పొట్టేపాళెం కలుజు వద్ద వంతెన, ఆమంచర్ల కలుజు, దగదర్తి మండలంలో విమానాశ్రయం, కావలి చెరువు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరుగా మార్పు, కావలిలో ఇందిరమ్మ కాలనీ అభివృద్ధి, కోవూరు సహకార చక్కెర కర్మాగారం తిరిగి తెరిపించడం, కందుకూరు పట్టణానికి బైపాస్‌ వంటి ఎన్నో హామీలు ఇవ్వడంతో పాటు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటిలో కొన్నింటికి శంకుస్థాపనలు చేసినా.. ఒక్కటీ పూర్తి కాలేదు. డబ్బులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు పారిపోయారు. ఇక గత ప్రభుత్వంలో 90 శాతం పూర్తయిన వాటినీ పట్టించుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు