logo

‘కేంద్రం పైసా ఇవ్వట్లేదు’

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి పైసా ఇవ్వట్లేదని ఆర్టీసీ ఛైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మండిపడ్డారు. జక్రాన్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఆయన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

Published : 24 May 2022 05:44 IST

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్న ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌

జక్రాన్‌పల్లి, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రానికి పైసా ఇవ్వట్లేదని ఆర్టీసీ ఛైర్మన్‌, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ మండిపడ్డారు. జక్రాన్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట సోమవారం ఆయన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఇద్దరు భాజపా నాయకులు తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు. జక్రాన్‌పల్లి మండలానికి పైపులైన్‌ ద్వారా కాళేశ్వరం నీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు నిధులు రాని గ్రామాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ డ్రైవర్‌ చరవాణి చూస్తూ బస్సు నడిపిస్తున్న వీడియోను ఒక అమ్మాయి పంపించగా ఆ డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్‌ చేసినట్లు గుర్తు చేశారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలతో ప్రమాణస్వీకారం చేయించారు. ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్‌,  ఎంపీపీ కుంచాల విమల, వైస్‌ ఎంపీపీ తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు తనూజరెడ్డి, మండలాధ్యక్షుడు భోజన్న పాల్గొన్నారు.
తెదేపాకు పూర్వ వైభవం తీసుకొద్దాం
ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: తెదేపాకు పూర్వ వైభవం తీసుకొద్దామని, తెలుగు రాష్ట్రాలకు తెదేపా అవసరం ఉందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు అన్నారు.  నిజామాబాద్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌ అధ్యక్షతన సోమవారం ఆర్మూర్‌ పట్టణంలో నిర్వహించిన మినీ మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యస్థలిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండి రైతుల పేరుతో ధర్నాలు చేయడం సిగ్గుచేటని, కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణాకు విముక్తి కావాలని వక్తలు, నాయకులు డిమాండు చేశారు. నాయకులు కుమార్‌ గౌడ్‌, కాశీనాథ్‌, వెంకటేశ్వర్లు, రాజన్న, సురేశ్‌, హనుమంత్‌రావు, బ్రహ్మచారి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని