logo

పిల్లల ఫోన్లపై ఓ కన్నేద్దాం

హైదరాబాద్‌లో బాలికపై అత్యాచార కేసులో పోలీసులకు విస్తుబోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఒకరు రోజూ తండ్రి స్మార్ట్‌ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి మిత్రులకు వాటిని చూపించేవాడు.

Published : 02 Dec 2022 04:03 IST

నిఘా కాదు... ముందు చూపు

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

హైదరాబాద్‌లో బాలికపై అత్యాచార కేసులో పోలీసులకు విస్తుబోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. అఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఒకరు రోజూ తండ్రి స్మార్ట్‌ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి మిత్రులకు వాటిని చూపించేవాడు. అందులో ఉన్నట్లు చేయాలని తోటి విద్యార్థినిపై దాడికి తెగబడ్డారని తేలింది.


* నిజామాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి యూట్యూబ్‌లో అశ్లీల వీడియోలు చూసేవాడు. ఒకసారి తండ్రి ఫోన్‌ వినియోగించే సమయంలో అసభ్య వీడియోలు వస్తుండటంతో ఎవరు చూస్తున్నారో గుర్తించడానికి ప్రయత్నించాడు. అంతలోగా బాలుడు అమ్మాయిలతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమవడంతో బయటపడింది.


* ఇందూరుకు చెందిన ఓ వ్యక్తి పోర్న్‌ వీడియోలకు బానిసయ్యాడు. ఎక్కువ మందితో వివాహేతర సంబంధాలకు ప్రయత్నించడంతో ఇంట్లో తెలిసి పంచాయితీ పెట్టుకుని కుటుంబం విడిపోయే వరకు వచ్చింది.


* జిల్లాకేంద్రంలోనే కొన్ని నెలల కిందట తోటి విద్యార్థినిని ఒక బాలుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.


టీవల మానసిక వైద్య నిపుణుల వద్దకు వచ్చే కేసుల్లో నెలకు కనీసం 20 మంది అశ్లీల వీడియోలకు బానిసలైన వారే ఉంటున్నారట. నియంత్రణ లేని వనరులు అందుబాటులో ఉండటంతో వీక్షించే సమయం పెరుగుతోంది. వారి వయసులో వచ్చే మార్పులకు వీడియోల ప్రభావంతో కోరికలు పెంచుకుంటున్నారు.  ఈ విపరీత ధోరణి వారి భవిష్యత్తును దుర్భరం చేస్తుందనే స్పృహ కోల్పోతున్నారు.

నిఘా అవసరమే..

పిల్లలపై నిఘా పెడితే తరచూ అనుమానిస్తున్నారని వారిలో అసహనం పెరుగుతుందనేది తల్లిదండ్రుల వాదన. ఇది తప్పు చేయని వారిని కుంగదీస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. వారి ప్రవర్తన సహా ఫోన్‌, ఇతర గ్యాడ్జెట్లను వినియోగించే సమయంలో వారు రహస్యంగా చూడటానికి ఇష్టపడుతుంటే ఓ కన్నేయాల్సిందేనని గ్రహించాలి. ఏదో అవసరం మీద అన్నట్లు తీసుకుని వాటిలోని అన్నింటిని స్కాన్‌ చేసేయాలి. అందుకు సంబంధించిన పరిజ్ఞానం తల్లిదండ్రులు పెంచుకోవాలి. బ్రౌజింగ్‌ హిస్టరీ, సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌, సంక్షిప్త సందేశాలు, తెర సమయం, ఫోన్‌ పలకరింపుల తీరు వంటివి పరిశీలించాలి. ప్రధానంగా ఇటీవల ఫోన్‌లపై నిఘా పెట్టడానికి పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు, లేదా సైబర్‌ నిపుణుల అభిప్రాయంతో వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ప్రయోజనమే.


భవితకు నష్టం

కిరణ్‌కుమార్‌, ఏసీపీ, బోధన్‌

అసభ్య వీడియోలు చూస్తున్నారని గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని మా వద్దకు తీసుకురావాలి. కౌన్సెలింగ్‌ ఇచ్చి వ్యసనం నుంచి బయటపడేలా చేస్తాం. నేరం చేస్తే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేస్తాం. అత్యాచారం వంటి కేసులో 10 ఏళ్ల వరకు, ఇతర నేర స్వభావాన్ని బట్టి 6 నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షలు ఉంటాయి. నేరాలకు పాల్పడితే ఉన్నత విద్య, ఉద్యోగాల విషయంలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తి జీవితం దుర్భరమవుతుంది.


సకాలంలో నిలువరించాలి

 ప్రొ।। డాక్టర్‌ విశాల్‌, న్యూరో సైకియాట్రిస్ట్‌

ఆహారపు అలవాట్లు, హర్మోన్లు, వీడియోలు పిల్లల మానసికస్థితిని నిర్దేశిస్తాయి. గ్యాడ్జెట్లలో ఏం చూస్తున్నారన్నది గుర్తించి ప్రాథమిక స్థాయిలోనే నిలువరించాలి. అది కొట్టడం, తిట్టడం కాకుండా దుష్పరిణామాలను వివరించాలి. లైంగిక విద్యనందించి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే బానిసలైతే కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని