logo

నేర్పుదామా.. విలువల పాఠం

ఇటీవల సాకర్‌ ప్రపంచ కప్‌ పోటీల సందర్భంగా అభిమానులు స్టేడియంలోని గ్యాలరీని శుభ్రం చేయడం చూసి ప్రపంచానికి శుభ్రత, మనిషి పాటించాల్సిన విలువలను చాటారు.

Updated : 09 Dec 2022 06:22 IST

ఆదరణ పొందుతున్న జపాన్‌ విద్యార్థుల వీడియోలు

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

ఇటీవల సాకర్‌ ప్రపంచ కప్‌ పోటీల సందర్భంగా అభిమానులు స్టేడియంలోని గ్యాలరీని శుభ్రం చేయడం చూసి ప్రపంచానికి శుభ్రత, మనిషి పాటించాల్సిన విలువలను చాటారు. ఈ ఘటనతో మరోసారి అక్కడి జీవన విధానంపై ఆసక్తి పెరిగి ఆరా తీయగా వారికి ఆ సంస్కృతికి బడిలోనే బీజం పడిందని నిరూపితమైంది. అందులో భాగంగానే ఆ దేశంలో విద్యార్థి దశలో నేర్పించే విలువలపై ఆరా తీయడం మొదలైంది. వాటిని అన్వయించుకోవాలంటూ ఆ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు.

ఇవీ  నేర్పిస్తారు....

* పెద్దలను, స్త్రీలను గౌరవించాలి. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే ఆర్టీసీ బస్సుల్లోని నినాదాలు అక్కడి విద్యార్థులకు నేర్పిస్తారు. వాటిని తప్పకుండా ఆచరించేలా అక్కడి సమాజం అనుసరిస్తుంటుంది.

* బడిలో కాపలాదారులు, స్వీపర్లు అంటూ ఎవరినీ నియమించుకోరట. విద్యార్థులే తమ బడి, తరగతి గదులను శుభ్రం చేసుకుంటారు.

* విద్యార్థులను బడిలో వదిలిపెట్టేందుకు తల్లిదండ్రులెవరూ ఎస్కార్టులుగా ఉండరు. సురక్షితంగా బడికి వెళతారనే నమ్మకం.

* రహదారిపై వెళ్లే వాహనాలు విద్యార్థులను చూసి నిలిపివేస్తారు. రోడ్డు దాటిన తరువాత పిల్లలు వాహనం నిలిపిన వారికి వంగి నమస్కరించి కృతజ్ఞత చాటుకుంటారు.

* బడిలో తోటి విద్యార్థులకు భోజనం వడ్డిస్తారు. తమ పాత్రలను తామే శుభ్రపరుచుకుంటారు.

* తోపులాట లేకుండా వరుస క్రమంలో ఓపిగ్గా నిరీక్షించే విధానం అలవరుస్తారు. అందుకే అక్కడి రైళ్లలో ప్రయాణికులు దిగే వరకు ఎవరూ ఎక్కడానికి ప్రయత్నించరు.

* పిల్లలు తడి, పొడి, హానికర చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేస్తారు.

* దుకాణాల్లో ఎలా వ్యవహరించాలో నేర్పిస్తారు.


జపాన్‌ తరగతి గది. అంతా చిన్నారులే. వారంతా ఒక బస్సులో కూర్చుని వెళ్తుంటే ఒక గర్భిణి, వృద్ధుడు, మహిళ... ఇలా ఒక్కో వయసు వారు వస్తుంటారు. వారికి లేచి సీటు ఇచ్చే సన్నివేశాన్ని పిల్లలకు ప్రయోగాత్మకంగా బోధిస్తుంటారు.


మిగతా ప్రపంచంతో పోలిస్తే జపాన్‌ విద్యార్థులు భిన్నమైన వారంటూ... మొదలై రహదారి దాటుతుంటే తమకోసం వాహనం నిలిపిన వ్యక్తికి కృతజ్ఞతగా నమస్కరించడం, బడిని శుభ్రం చేయడం, చెత్తను డబ్బాల్లో వేయడం వంటి వారి జీవన విధానం కనిపిస్తుంటుంది.


మన సంప్రదాయమూ  అదే...

స్త్రీలు, వృద్ధులను గౌరవించడం వంటి వాటితోపాటు జపాన్‌ విద్యార్థులు నేర్చుకునే సంప్రదాయాలు మన సంస్కృతిలో భాగమే. నేటి ఆధునిక పోకడలో చదువొక్కటే ప్రధానమై కూర్చుంది. ఫలితంగా విలువల బోధనకు సమయం దక్కడం లేదు. ఐఐటీ, నీట్‌ వంటి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవడం, వాటి సిలబస్‌ను అందుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నిద్ర లేచిన వెంటనే పుస్తకం పట్టుకుని కనిపించినా... ఇంటికి ఎవరొచ్చినా గదిలో తనకు తాను చదువుకుంటే గొప్ప విద్యార్థి. ఇక్కడ ఇంటికి వచ్చిన అతిథులకు నమస్కారం చేసి గౌరవించాలనే అలవాటును కోల్పోతున్నారనే విషయాన్ని గ్రహించడంలేదు. పెద్దలు ఎదురుపడినప్పుడు నమస్కారం చేయడం మన విధానం. ఇలాంటి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు నేటి తరం. వివిధ దేశాల్లో ఇదే ఆనవాయితీ ఉండటంతో జపాన్‌ విద్యార్థులు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.

మా పాప/బాబు ఎలా చదువుతున్నారు?

ఇదీ అత్యధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో నిర్వాహకులకు వేసే మొదటి ప్రశ్న. పిల్లలపై ఆరా తీసే క్రమంలో ఎక్కువగా వారి విద్యా సంబంధమైన అంశాలపైనే ప్రశ్నలుంటాయి. ఈ మేరకు పలువురు నిర్వాహకులను ‘న్యూస్‌టుడే’ ఆరా తీయగా వారు వ్యక్తపరచిని అంశాలు...

* మా పిల్లలు ఎలా చదువుతున్నారనే 80 శాతం మంది ఆరా తీస్తారట.

*  ఓ 20 శాతం మంది ఇంటి వద్ద,   హాస్టళ్లలో సరిగా తినడంలేదనే ఫిర్యాదులు   చెబుతారు.

*  ఇటీవల కాలంలో విద్యార్థుల సున్నిత స్వభావంతో 30-40 శాతం మందే ప్రగతిపై సమీక్షిస్తున్నారు. ఇది కరోనాకు పూర్వం ఎక్కువ ఉండేదట.

 60 శాతం  మంది ఏదో ఒకరకంగా తమ పిల్లల ప్రవర్తనపై ఆందోళనతో ఉన్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

* ప్రవర్తన మార్చాలని చెప్పేవారి సంఖ్య తక్కువగానే ఉన్నా... హాస్టళ్లలో చేర్చిన తరువాత వచ్చే సానుకూల మార్పులపై 30 శాతం మంది సంతృప్తితో ఉంటున్నారట.

* 30 శాతం మందిలో కనీస మర్యాదలు  కనిపించవనే వాదన ఉంది.

ఈ ప్రశ్నలన్నింటిలోకెల్లా మా పిల్లలు గురువులతో ఎలా వ్యవహరిస్తున్నారనేది ఉత్తమమైందని చెబుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని