logo

సీనియర్‌ నేతకు గుర్తింపు

జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు తాహెర్‌ బిన్‌ హందాన్‌కు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. ఆయనను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరికొండకు చెందిన ఈయన చాలా కాలంగా నిజామాబాద్‌ నగరంలో నివాసం ఉంటున్నారు.

Published : 02 Mar 2024 03:06 IST

తాహెర్‌ బిన్‌ హందాన్‌కు రాష్ట్ర పదవి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు తాహెర్‌ బిన్‌ హందాన్‌కు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. ఆయనను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరికొండకు చెందిన ఈయన చాలా కాలంగా నిజామాబాద్‌ నగరంలో నివాసం ఉంటున్నారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1981-87 సంవత్సరంలో ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశారు. 1985లో నిజామాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి అవకాశం రాగా ఓటమి చెందారు. తరువాత 1994లో బోధన్‌, 2018లో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి చెందినా నిరాశకు గురి కాలేదు. 2006 నుంచి 2011 వరకు సిరికొండ జడ్పీటీసీగా ఉంటూ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌గా పని చేశారు. అనుకోకుండా జడ్పీలో ఏర్పడిన పరిణామాలతో 2008 నుంచి ఏడాది కాలం ఇన్‌ఛార్జి జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. 2012లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ పగ్గాలు చేపట్టి.. 2018 వరకు పని చేశారు. 2018 నుంచి మొన్నటి వరకు నిజామాబాద్‌ అర్బన్‌ పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం తాహెర్‌ టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ టెలికాం డైరెక్టర్‌గా పనిచేశారు. మజ్దూర్‌ సంఘ్‌ కార్మిక నాయకుడిగా పని చేస్తూ కార్మికుల సమస్యలపై పోరాటం చేశారు. జిల్లాకు చెందిన నాయకుడికి రాష్ట్ర పదవి రావడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు