logo

‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యమైందని, ప్రతిపాదిత భూమి అప్పగిస్తే ఏడాదిలో ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ పేర్కొన్నారు. జక్రాన్‌పల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు.

Updated : 08 May 2024 06:51 IST

 జక్రాన్‌పల్లిలో ప్రసంగిస్తున్న ఎంపీ అర్వింద్‌, చిత్రంలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ తదితరులు
జక్రాన్‌పల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యమైందని, ప్రతిపాదిత భూమి అప్పగిస్తే ఏడాదిలో ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ పేర్కొన్నారు. జక్రాన్‌పల్లిలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం, వైద్యం అందిస్తోందని, ఏటా రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నామని గుర్తుచేశారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఇందూర్‌ గడ్డ మీదే ఏర్పాటు చేస్తామని అమిత్‌షా స్పష్టం చేసినా కాంగ్రెస్‌, భారాస నాయకులు ఇంకా అడగటం విడ్డూరంగా ఉందన్నారు. యూనిఫాం సివిల్‌కోడ్‌ అమలు చేస్తామని తెలిపారు. భారాస అధినేత కేసీఆర్‌ విలాసవంతమైన బస్సులో టూర్‌కు వచ్చినట్లుగా ఉందని, పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా చేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌, నాయకులు తిరుపతిరెడ్డి, కిషన్‌ నాయక్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కోటపాటి, గంగారెడ్డి, మోహన్‌నాయక్‌ పాల్గొన్నారు.

రిజర్వేషన్లు తొలగించింది కాంగ్రెస్సే: ఇందూర్‌ సిటీ: వర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భాజపా రాజ్యాంగం మార్చే ఆలోచనలో ఉందని తమపై కాంగ్రెస్‌ నేతలు బురదజల్లుతున్నారని, మార్చేందుకు ఇప్పుడు తమకు మెజారిటీ లేదా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సెక్యులర్‌ పదం రాజ్యాంగంలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. అలీగఢ్‌ వర్సిటీలో స్పెషల్‌ యాక్టు తెచ్చి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించి విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు. 2011లో జామియా మిలియా వర్సిటీలో 2011లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించారని గుర్తుచేశారు. వచ్చే రోజుల్లో ఉస్మానియా, హెచ్‌సీయూలకూ ఇదే గతిపడుతుందన్నారు. కాంగ్రెస్‌ నేతలు రోహింగ్యాలకు సైతం రిజర్వేషన్లు, పౌరసత్వం అడుగుతున్నారని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించి వారికి ఇవ్వడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమావేశంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు