logo

ఉద్యమ ఊపిరి.. కామారెడ్డి

  తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కామారెడ్డి అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు.

Published : 08 May 2024 07:16 IST

జిల్లా ఉండాలా.. వద్దా..?

రోడ్‌షోలో భారాస అధినేత కేసీఆర్‌

ప్రసంగిస్తున్న భారాస అధినేత కేసీఆర్‌

 ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, కామారెడ్డి అర్బన్‌:  తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ కామారెడ్డి అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొనియాడారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో మంగళవారం సాయంత్రం రోడ్‌ షో అనంతరం జేపీఎన్‌ కూడలి వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ కోసం పోలీస్‌ కానిస్టేబుల్‌ కిష్టయ్య ఆత్మబలిదానం చేసుకున్న ప్రాంతం కామారెడ్డి అన్నారు. ఇంతటి పోరాటాల గడ్డ కామారెడ్డి ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉండాలా..? వద్దా..? అని సభికులను కేసీఆర్‌ ప్రశ్నించగా అందరు ముక్తకంఠంతో ఉండాలని నినదించారు. మరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త జిల్లాలను తీసివేస్తామంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో భారాసకు ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలన్నారు. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా మూడోస్థానంలో ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి ఐదునెలల సమయంలోనే ప్రజలకు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పాలన రాగానే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయి. యాసంగి సీజన్‌లో ఈ ప్రాంతంలో పొలాలు ఎండిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.

 నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి ప్రారంభం

 జిల్లాకేంద్రంలో కేసీఆర్‌ రోడ్‌షో నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి ప్రారంభమై స్టేషన్‌ రోడ్డు మీదుగా ఇందిరాచౌక్‌, సిరిసిల్ల రోడ్‌, పొట్టిశ్రీరాములు విగ్రహం రోడ్డు మీదుగా జేపీఎన్‌ చౌరస్తా వరకు సాగింది. దారి పొడవునా బోనాలు, డోలు వాయిద్యాలతో ప్రజలు స్వాగతం పలికారు. జై తెలంగాణ నినాదాలతో పట్టణం మార్మోగింది. ఉద్యమం నాటి రోజులను కేసీఆర్‌ పర్యటన గుర్తుచేసింది. జిల్లాకేంద్రవాసులే కాకుండా సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున భారాస కార్యకర్తలు తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం కావాల్సిన రోడ్‌షో రెండున్నర గంటలు ఆలస్యంగా మొదలైంది. వాతావరణం చల్లబడడంతో పట్టణవాసులు పెద్దఎత్తున రోడ్‌షోలో పాల్గొన్నారు. కూడలి సమావేశం అనంతరం కేసీఆర్‌తో కరచాలనం చేసేందుకు నాయకులు పోటీపడ్డారు.

కార్యకర్తల్లో జోష్‌..

కేసీఆర్‌ రోడ్‌షో విజయవంతం కావడం భారాస శ్రేణుల్లో జోష్‌ నింపింది. కొందరు ముఖ్యనేతలు అధినేత పర్యటనకు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, సురేందర్‌, భారాస జిల్లాధ్యక్షుడు ముజీబొద్దిన్‌ పాల్గొన్నారు.

వరుసలోకి మరో వాహనం

రోడ్‌షో పాల్గొనేందుకు భారాస నాయకుల వాహనశ్రేణి నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి రైల్వేవంతెన వైపు వెళ్తున్న క్రమంలో వేరొకరి కారు వాహన వరుసలో ప్రవేశించింది. దీనిని పసిగట్టిన భారాస నాయకులు అడ్డుకోబోయారు. దీంతో సదరు వాహన యజమాని భారాస నాయకులతో వాగ్వాదానికి దిగడంతో కోపోద్రిక్తులైన కార్యకర్తలు కారుపై దాడిచేశారు. గమనించిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కారును బయటకు తీసుకెళ్లారు. ఈ దాడిలో కారు ధ్వంసమైంది. వాహన యజమానిపై దాడి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు