logo

వయోవృద్ధులే నయం

ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు ఒక వైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Published : 10 May 2024 02:44 IST

ఉద్యోగుల కంటే పది శాతం ఎక్కువగా పోలింగ్‌

ఇంటి వద్ద ఓటు వేస్తున్న వృద్ధుడు

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు ఒక వైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌శాతం మెరుగుపరచడానికి 40 రోజుల నుంచి స్వీప్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. ఓటు హక్కు వినియోగంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగుల్లో కొందరు ఓటుకు దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి మే 8వ తేదీ వరకే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటేయాల్సి ఉంది. కానీ జిల్లాలో 691 మంది ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ ఈ నెల 10వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీనికి భిన్నంగా వయోవృద్ధులు, దివ్యాంగులు (95 శాతం మంది) ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లాలో ఇలా..

కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. ఉద్యోగులు ఫారం- 12 ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లాలో 4,546 మంది ఉద్యోగులు తమకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. వీరు దరఖాస్తులో సమర్పించిన వివరాల ఆధారంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, మద్నూర్‌ కేంద్రాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ నెల 4వ తేదీ నుంచి ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. వారిలో 3,855 మంది (ఈ నెల 8వ తేదీ వరకు) మాత్రమే ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. 85 శాతం మందే ఓటేశారు. ఇక 85 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు, దివ్యాంగులకు సైతం ఎలక్షన్‌ కమిషన్‌ ఇంటి వద్ద ఓటు సౌకర్యం కల్పించింది. ఫారం 12-డీ ద్వారా జిల్లాలో 439 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరికి కూడా ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ఓటు వేసే సౌకర్యం కల్పించారు. ఇందులో 419 మంది ఓటు వేశారు.

నేడే చివరి అవకాశం

ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేని ఉద్యోగులు త్వరపడితే అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఎన్నికల సంఘం గడువు పెంచడంతో దూర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఉద్యోగులు శతశాతం ఓటింగ్‌లో పాల్గొంటేనే సాధారణ ఓటర్లు కూడా అదే బాటలో నడుస్తారు. ఉద్యోగులు నేడు ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు