logo

రక్తం కొరత

ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు.

Published : 10 May 2024 02:52 IST

రెడ్‌క్రాస్‌, జీజీహెచ్‌లో నిండుకున్న నిల్వలు
దాతలు స్పందించాలి
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొసాగుతుండటంతో కనీసం కార్యకర్తలతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు నాయకులు తీరికలేకుండా ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రమాదాలు, ప్రసవాలు పెరగడం, థలసీమియా రోగులకు రక్తం ఎక్కిస్తుండటంతో నిల్వలు నిండుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రెడ్‌క్రాస్‌, జీజీహెచ్‌ సిబ్బంది ఉన్నారు.

నిత్యం 25 నుంచి 30 యూనిట్లు

నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ రక్తనిధికి నిత్యం 25 నుంచి 30 యూనిట్ల రక్తం అవసరం. ప్రమాదాలు, ప్రసవాలు, కాలిన గాయాలైనవారు, థలసీమియా రోగులు ఎక్కువగా వినియోగిస్తారు. రెడ్‌క్రాస్‌లో గత రెండు నెలల నుంచి కేవలం 30 నుంచి 40 యూనిట్లే రక్తం నిల్వలున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్నవారు తిరిగి ఇవ్వడం లేదు. ఇటీవల అతికష్టం మీద ఒక శిబిరం నిర్వహించి చేసి 60 యూనిట్లు సేకరించారు. ఇది కేవలం రెండు మూడు రోజులకే సరిపోతుంది.

థలసీమియా రోగులకు ఉచితం

రెడ్‌క్రాస్‌ సంస్థ థలసీమియా రోగుల కోసం రక్తమార్పిడి చేసేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసింది. మంగళ, శుక్రవారాల్లో 40 యూనిట్లు ఉచితంగా ఎక్కిస్తున్నారు. దీన్ని 2023 డిసెంబరులో ప్రారంభించారు. ఇప్పటి వరకు 826 యూనిట్లు థలసీమియా రోగులకు అందించారు. ఆరోగ్యశ్రీ లేకపోవడంతో రక్తం ఎక్కించడానికే ఇప్పటి వరకు సుమారు రూ. 13 లక్షలు ఖర్చు చేశారు.

నిత్యం 100 నుంచి 150 మంది

నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోజురోజుకు ప్రసవాలు పెరుగుతున్నాయి. ఇన్‌ పేషెంట్లు నిత్యం 100 నుంచి 150 మంది చేరుతున్నారు. వీరిలో ప్రమాద బాధితులు, బాలింతలే ఎక్కువ. ఈ రెండు కేసులకు రక్తం అవసరం ఉంటుంది. జీజీహెచ్‌లో ప్రస్తుతం 120 యూనిట్లు అందుబాటులో ఉంది. నిత్యం 15 నుంచి 20 యూనిట్లు రోగులకు ఎక్కిస్తారు. ఇక్కడ రోగుల కుటుంబ సభ్యులు ఒక్కరు రక్తం ఇస్తే గాని యూనిట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరూ ఇవ్వకుంటే బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా దాతలు, అవగాహన ఉన్నవారు స్పందించి వేసవిలో రక్త దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్యులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని