logo

వ్యాపిస్తున్న జ్వరాలు... కొవిడ్‌ భయాలు

రాష్ట్రంలో ఫ్లూ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అక్కడక్కడా కొంతమందిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆరోగ్యశాఖ నిపుణులు పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 01:40 IST

ఆందోళన వద్దన్న వైద్య, ఆరోగ్య నిపుణులు

డాక్టర్‌ నీరజ్‌ మిశ్ర, డాక్టర్‌ నిరంజన్‌ మిశ్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫ్లూ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అక్కడక్కడా కొంతమందిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆరోగ్యశాఖ నిపుణులు పేర్కొన్నారు. విష జ్వరాలతో బాధపడుతున్న వారు వేలల్లో ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

నియంత్రణలో మహమ్మారి: ఫ్లూజ్వరాల బారిన పడుతున్న వారు వెంటనే కోలుకోవడం లేదు. దగ్గు ఎక్కువగా ఉంటోంది. ఈ లక్షణాలున్న బాధితుల్లో కొందరికి కొవిడ్‌ భయం వెంటాడుతోంది. దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ సలహాదారు, కొవిడ్‌ నిపుణుడు డాక్టర్‌ నీరజ్‌ మిశ్ర శనివారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుత జ్వరాలు కొవిడ్‌ వైరస్‌ వల్ల కాదని, రాష్ట్రంలో మహమ్మారి నియంత్రణలో ఉందని చెప్పారు. బాధితులందరికీ ఇన్‌ఫ్లూఎంజా లక్షణాలు ఉన్నాయని, ఇది ప్రమాదకారి కాదని తెలిపారు. కొందరిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. ఈ రెండు రకాల జ్వరాలు త్వరగా వ్యాపిస్తున్నందున బాధితులు వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచన మేరకు మందులు వాడాలన్నారు.

అన్నిచోట్లా ఉచిత పరీక్షలు, చికిత్స...: ఆరోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్‌ నిరంజన్‌ మిశ్ర శనివారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిచోట్లా శాంపిళ్ల సేకరణ, పరీక్షలు ఉచితంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత జ్వరాలు కొవిడ్‌ వైరస్‌కి సంబంధించినవి కావని, ఆందోళనకు గురి కావద్దని సూచించారు. రాష్ట్రంలో అక్కడక్కడా నిత్యం ఒకట్రెండు కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయని, బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని