logo

నేడు రాష్ట్రవ్యాప్తంగా గాలివానకు అవకాశం

రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు ఎండ ఉంటున్నా ఆ తర్వాత క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఉరుములు, గాలివాన, పిడుగు పాట్లకు కారణమవుతున్నాయి

Published : 31 Mar 2023 02:39 IST

పిడుగులు, వడగళ్లు పడతాయని ఐఎండీ హెచ్చరిక

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు ఎండ ఉంటున్నా ఆ తర్వాత క్యూములోనింబస్‌ మేఘాలు ఏర్పడి ఉరుములు, గాలివాన, పిడుగు పాట్లకు కారణమవుతున్నాయి. గురువారం గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... గడిచిన 24 గంటల్లో ఢెంకనాల్‌ జిల్లా భుభన్‌లో అత్యధికంగా 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జాజ్‌పూర్‌ జిల్లా జెనాపూర్‌లో 48.2 మి.మీ. వాన కురిసినట్లు దాస్‌ తెలిపారు. మిగతా కేంద్రాల్లో సాధారణ వర్షాలు కురిశాయన్నారు. శుక్రవారం ఝార్సుగుడ, సుందర్‌గఢ్‌, కేంఝర్‌, మయూర్‌భంజ్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, అనుగుల్‌, ఢెంకనాల్‌, కేంద్రపడ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ‘ఆరెంజ్‌’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఈ జిల్లాల్లో పిడుగులు, వడగళ్లు పడతాయన్న అంచనా ఉందని చెప్పారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ గాలివానలకు అవకాశం ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. శనివారం వరకు రాష్ట్రంపై కాలవైశాఖి ప్రభావం ఉంటుందని ఉమాశంకర్‌ దాస్‌ చెప్పారు. రబీ పంటలు వేసిన రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు