logo

సంబల్‌పూర్‌ నుంచి నాగేంద్ర... కటక్‌కు సురేష్‌

సంబల్‌పూర్‌ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్‌ ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్‌ నుంచి సురేష్‌ మహాపాత్ర్‌ బరిలో దిగారు.

Published : 30 Apr 2024 05:08 IST

2 లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు

 భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సంబల్‌పూర్‌ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్‌ ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్‌ నుంచి సురేష్‌ మహాపాత్ర్‌ బరిలో దిగారు. ఆదివారం రాత్రి ఏఐసీసీ అధిష్ఠానం రెండు లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాల జాబితా ప్రకటించింది. 

నాగేంద్ర చేరికతో...: గతంలో సంబల్‌పూర్‌ లోక్‌సభకు దులాల్‌ చంద్ర ప్రధాన్‌ను హస్తం పార్టీ అభ్యర్థిగా చేశారు. ఇంతలో బిజద అగ్రనేత, మాజీ ఎంపీ నాగేంద్ర పార్టీలో చేరడంతో దులాల్‌ చంద్రను పోటీ నుంచి తప్పించి నాగేంద్రకు అవకాశమిచ్చారు. కటక్‌కు చెందిన పార్టీ అగ్రనేత సురేష్‌ను లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించారు.

సోఫియాకు అవకాశం..: బారాబటి కటక్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే మహమ్మద్‌ ముఖిం కుమార్తె సోఫియా ఫిర్దోస్‌ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆమెను కాంగ్రెస్‌ నాయకత్వం అసెంబ్లీ అభ్యర్థిగా నిలిపింది. 8 మంది జాబితాలో ప్రమోద్‌కుమార్‌ హేంబ్రం (బరిపద), దేవీ ప్రసన్న చాంద్‌ (బాలేశ్వర్‌), మోనాలిసా లెంక (బాలేశ్వర్‌), అజయ్‌ సామల్‌ (బొడొచొణా), ఫకీర్‌ సామల్‌ (పలలహడ), ప్రతిమా మల్లిక్‌ (జగత్సింగ్‌పూర్‌) ఉన్నారు. ఖండపడ స్థానానికి ఇదివరకు ప్రకటించిన మనోజ్‌కుమార్‌ ప్రధాన్‌ బదులుగా వైజయంతిమాల మహంతి బరిలో ఉన్నారు.

మయూరభంజ్‌ జేఎంఎంకు..: ఇంతవరకు కాంగ్రెస్‌ 20 లోక్‌సభ, 144 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మయూర్‌భంజ్‌ లోక్‌సభ సీటు జేఎంఎంకు కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ఛత్రపురం, కాకట్‌పూర్‌, నీలగిరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని