logo

మా అమ్మాయికే మీ ఓటు..!

ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది.

Published : 08 May 2024 04:05 IST

తండ్రుల స్థానాల్లో కుమార్తెల పోటీ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ 21 మందికి, భాజపా 12 మందిని అభ్యర్థులుగా చేశాయి.

లోక్‌సభకు బిజద 33 శాతం సీట్లు

పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందినా ఈసారి ఎన్నికల్లో అమలుకు నోచుకోలేదు. ప్రాంతీయ పార్టీ బిజద 2019లో లోక్‌సభకు 33 శాతం టికెట్లు మహిళలకు కేటాయించింది. 21 స్థానాలకుగాను ఏడుగురిని పోటీకి నిలిపింది. ఈసారి అంతే సంఖ్యలో అవకాశమిచ్చింది. భాజపా నలుగురికి, కాంగ్రెస్‌ ఇద్దరికి అవకాశమిచ్చాయి. 147 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి ప్రధాన పార్టీలేవీ 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించలేదు.
ఇదివరకు తండ్రులు ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో వారి కుమార్తెలను బరిలోకి దించారు. ఝార్సుగుడ అసెంబ్లీ స్థానంలో మాజీ (దివంగత) మంత్రి నబకిశోర్‌ దాస్‌ కుమార్తె దీపాలిదాస్‌ బిజద నుంచి పోటీ చేస్తున్నారు. పదంపూర్‌ స్థానంలో మాజీ మంత్రి బిజయ రంజన్‌ సింగ్‌ బరిహ కుమార్తె బర్షాసింగ్‌, కవిసూర్యనగర్‌లో నిత్యానంద ప్రధాన్‌ కూతురు లతికా ప్రధాన్‌ బిజద అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. మాజీమంత్రి రామకృష్ణ పట్నాయక్‌ కుమార్తె అనితా శుభదర్శిని అస్కా లోక్‌సభ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్‌ కుమార్తె అమితా బిశ్వాల్‌ ఝార్సుగుడ నుంచి, మహమ్మద్‌ ముఖిం కుమార్తె సోఫియా ఫిర్దోస్‌ బారాబటి - కటక్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు. లలితేందు బిద్యాధర్‌ మహాపాత్ర్‌ కుమార్తె ఉపాసనా మహాపాత్ర్‌ బ్రహ్మగిరి నుంచి భాజపా అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాజపరివారానికి చెందిన కిశోర్‌చంద్ర సింహదేవ్‌ కుమార్తె సులక్షణా గీతాంజలి సన్నోఖెముండి నుంచి బిజద తరఫున పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి హరప్రసాద్‌ సాహు కుమార్తె రంజితా సాహు అస్కా లోక్‌సభ స్థానంలో బిజద అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బిజద, కాంగ్రెస్‌ నాయకత్వాలు ఈసారి కొందరు నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో వారి భార్యలు, కొడుకులకూ టికెట్లు కేటాయించాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని