logo

చందన యాత్రకు పూరీ సన్నద్ధం

పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ.

Published : 10 May 2024 03:13 IST

నేడు అక్షయ తృతీయ: రథాల కలప పూజ

నందపడవకు పూజలు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ. ఈ పర్వదినం నుంచి 21 రోజులపాటు నరేంద్ర పుష్కరిణిలో వేడుకలు భక్తులకు నేత్రపర్వం చేయనున్నాయి. శుక్రవారం నుంచి పురుషోత్తముని ఘోషయాత్ర రథాల తయారీ పనులకు మహరణ (వడ్రంగి) సేవాయత్‌లు శ్రీకారం చుడతారు. రాత్రి 7 గంటలకు నందిఘోష్‌, తాళధ్వజ, దర్పదళన్‌ రథాల కలపకు పూజలు చేస్తారు. ఇది అన్నదాతలకు పండగ సమయం. శుభముహూర్తంలో పంట పొలాల్లో పుడమి తల్లికి పూజలు చేసి పొడిదుక్కులు చేసి విత్తనాలు చల్లుతారు.

ముస్తాబైన పుష్కరిణి, పడవలు: శ్రీక్షేత్రంలో రత్నసింహాసనంపై కొలువుదీరిన జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో పూజలందుకునే గోవిందుడు, శ్రీదేవి, భూదేవి, రామకృష్ణులు పంచపాండవుల ఉత్సవ విగ్రహాలను సేవాయత్‌లు శుక్రవారం నుంచి 21 రోజులపాటు పల్లకిలో తిరువీధిగా నరేంద్రపుష్కరిణికి రోజూ తీసుకొస్తారు. జయదేవుని అష్టపదులు ఆలాపన, మంగళ వాయిద్యాల ఘోష బొడొదండొలో మార్మోగుతుంది. పుష్కరిణి ఆవరణలో విగ్రహాలకు చందన, సుగంధ ద్రవ్యాల లేపనం చేస్తారు. నంద, భద్ర పడవల్లో జలక్రీడలు ఆడిస్తారు. ఈ వేడుకలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి, పడవలు  ముస్తాబయ్యాయి. గురువారం పడవలకు పూజలు చేశారు.

నిర్ణీత వేళ్లల్లో సేవలు: శ్రీక్షేత్ర పాలనాధికారి వీర్‌విక్రం సింగ్‌ యాదవ్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ... నిర్ణీత వేళల్లో చందనయాత్ర సేవలు జరుగుతాయని, పుష్కరిణి వద్ద భక్తులంతా సహకరించాలని కోరారు. వ్యర్థాలు పారబోయరాదని, పవిత్రత, పారిశుద్ధ్యం కీలకమని చెప్పారు.

నేడు సుకుండాలో ఉత్సవాలు ప్రారంభం

సుకుండాలో కొలువైన లక్ష్మీ నృసింహ స్వామి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర సమీపాన రెండో సింహాచలంగా ఖ్యాతిగాంచిన సుకుండాలోని చందనియా కొండపై కొలువైన శ్రీలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో శుక్రవారం ‘295వ వార్షిక చందనోత్సవాలు’ ప్రారంభమవుతాయి. తొలిరోజు వేకువజామున స్వామివారి నిజరూప దర్శనం అనంతరం స్వర్ణాలంకరణ జరుగుతుందని దేవస్థానం ట్రస్టీ ఆనెం పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజులపాటు (ఈ నెల 12వ తేదీ వరకూ) ఉత్సవాలు కొనసాగుతాయని, ప్రతిరోజు ప్రత్యేక హారతులు, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలల సేవ తదితరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో రోజూ వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, గంజాం జిల్లాతోపాటు పొరుగున ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే భక్తుల కోసం వసతి, భోజనాలు కల్పిస్తున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని