logo

వన్‌దన్‌ ఫలాలు ఎక్కడ?

గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు విలువను జోడించి, శ్రమకు తగిన ఫలితం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వన్‌దన్‌ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. గిరిజన సహకార సంస్థ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఐటీడీఏ పరిధిలో వైఎస్సార్‌ క్రాంతి

Published : 28 Jun 2022 04:36 IST

 సాలూరు మండలం కురుకుట్టి పంచాయతీకి కేటాయించిన చింతపండు కేకు తయారీ యంత్రం ఇది.

దీన్ని ప్రారంభించకుండా జీడి పిక్కల గోదాములో ఆరు నెలలుగా నిరుపయోగంగా వదిలేశారు.

పార్వతీపురం, సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు విలువను జోడించి, శ్రమకు తగిన ఫలితం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వన్‌దన్‌ యోజన పథకాన్ని ప్రవేశ పెట్టింది. గిరిజన సహకార సంస్థ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఐటీడీఏ పరిధిలో వైఎస్సార్‌ క్రాంతి పథం ఆధ్వర్యంలో నిధుల వినియోగం, సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన్యంలో వన్‌దన్‌ వికాస కేంద్రాలు తెరమీదకు తీసుకొచ్చి రెండేళ్లు గడిచినా ఫలాలు మాత్రం చేతికి అందడం లేదు. ఉన్నత స్థాయిలో దిశానిర్దేశం చేయకపోవడంతో పథకం నీరుగారే స్థితికి చేరింది.

ఎందరో ఉపాధికి దూరం..

జిల్లాలోని 54 కేంద్రాల్లో యంత్రాలతో కాకుండా నేరుగా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో చింతపండు, పసుపు, కొండచీపుర్లను తయారు చేయించారు. ఇప్పటివరకు 48 టన్నుల చింతపండును కొనుగోలు చేసి కిలోపై రూ.10 లాభం వచ్చేలా విక్రయాలు చేపట్టారు. ఎనిమిది మండలాల్లోని వనదన్‌ కేంద్రాల్లో లక్షన్నర కొండచీపుర్లు తయారు చేశారు. ఒకదానిపై రూ.10 నుంచి రూ.15 వరకు లాభాలు సంపాదించారు. ఈ ప్రక్రియ జోరుగా సాగిన అనంతరం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఒక్కో కేంద్రంలో 300 మంది చొప్పున మహిళలకు ఉపాధి కల్పించారు. మొత్తం 16,200 మంది ఆదాయం పొందేవారు. అన్నిచోట్లా పూర్తి స్థాయిలో పనులు లేకపోవడంతో చాలా మంది ఉపాధికి దూరమయ్యారు.

పెట్టుబడి లేక సమస్య..

యంత్రాల కొనుగోలుకు భారీగా నిధులు మంజూరు చేస్తున్న యంత్రాంగం పెట్టుబడి నిధిని కేటాయించడం లేదు. దీంతో ఆరంభంలోనే అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటివరకు చేసిన వ్యాపారానికి రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. మహిళా సమాఖ్య ద్వారా రుణ ప్రాతిపదికన ఈ మొత్తం ముందుగా తీసుకొని తర్వాత చెల్లించారు. ప్రస్తుతం చేయాల్సిన వ్యాపారాలకు పెట్టుబడులు లేక వెనకడుగు వేస్తున్నారు. దీంతో యూనిట్లు నడపాల్సిన చోట్ల భవనాలు ఆర్బీకేలకు కేటాయించారు.  


ఐటీడీఏ పరిధిలో పరిస్థితి.. వన్‌దన్‌ వికాస కేంద్రాలు: 54

యంత్రాల కోసం విడుదలైన నిధులు: రూ.3.16 కోట్లు

ప్రతిపాదించిన యంత్రాలు: పసుపు, కాగితం ప్లేట్లు, మినపగుళ్లు తయారీ యంత్రాలు, చింతపండు, జీడి పిక్కలు ప్రాసెసింగ్‌ యంత్రాలు

సమస్య: యంత్రాలు కొనుగోలు చేయడానికి రూ.3.12 కోట్లు అందుబాటులో ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిధులు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయగా వచ్చిన వడ్డీ రూ.11 లక్షలతో కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు. మినప గుళ్లు, పేపరు ప్లేట్లు, పసుపు తయారీ యంత్రాలకు ధర ఖరారు చేశారు.

మరమ్మతులు అవసరం: పదేళ్ల క్రితం 6 జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లను ఐటీడీఏ ఏర్పాటు చేసింది. వీటిని వినియోగించకపోవడంతో మరమ్మతులకు గురయ్యాయి.  


 

అన్ని యూనిట్లు ప్రారంభిస్తాం

జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు మరమ్మతులు చేసి ప్రారంభించాలని నిర్ణయించినా ఈ ఏడాది ఆశించిన మేర దిగుబడి రాలేదు. యంత్రాలను మరో ఏడాది పాటు వృథాగా ఉంచితే పాడయ్యే ప్రమాదం ఉంది. చింతపండుకు సంబంధించిన పరికరాలు పలు సంఘాలకు అందజేశాం. త్వరలో మరిన్ని కొనుగోలు చేసి అన్ని యూనిట్లు ప్రారంభిస్తాం.

- వై.సత్యంనాయుడు, డీఆర్‌డీఏ పీడీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని