logo

బదిలీల్లో ‘బ్లాక్‌’

ఉపాధ్యాయ బదిలీల్లో కొన్ని ఖాళీలను బ్లాక్‌ చేయనున్నారు. గతంలో తీసుకొచ్చిన విధానాన్ని ప్రస్తుత బదిలీల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 28 May 2023 02:45 IST

కొన్ని ఖాళీలే కోరుకునే అవకాశం

విద్యాశాఖ సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీల్లో కొన్ని ఖాళీలను బ్లాక్‌ చేయనున్నారు. గతంలో తీసుకొచ్చిన విధానాన్ని ప్రస్తుత బదిలీల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని మండలాలకు ఉపాధ్యాయులు ఉండేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. బ్లాక్‌ చేసినవి కోరుకునే అవకాశం లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని ఖాళీలను చూపాలన్న డిమాండ్‌ వస్తోంది.

జిల్లా యూనిట్‌గా మంజూరు పోస్టులు, పనిచేస్తున్న వారు, ఖాళీలను గుర్తిస్తారు. దీని ఆధారంగా మండల స్థాయిలో ఖాళీలను అనుపాతంలో కేటగిరి-1, 2, 3 బ్లాక్‌ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయ్యే ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి బ్లాక్‌ చేసే ఖాళీల సంఖ్య ఆధారపడి ఉంటుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. హేతుబద్ధీకరణతో ఏర్పడిన మిగులు ఖాళీలు, 8, 5 విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకుని తప్పనిసరిగా బదిలీ అయ్యేవారు, ఇంక్రిమెంట్‌పై జూనియర్‌ కళాశాలకు వెళ్లినవారు, ఉద్యోగోన్నతులకు అంగీకరించిన వారి ఖాళీలను బదిలీల్లో కోరుకునే అవకాశం కల్పిస్తారు. ఈ ఖాళీల్లో కొన్ని బ్లాక్‌ చేస్తారు. ఉమ్మడి జిల్లాలో కళాశాలకు వెళ్లినవారు, ఉద్యోగోన్నతులకు ఆమోదం తెలిపిన వారు 160 మంది ఉన్నారు. రేషనలైజేషన్‌లో మిగులు ఖాళీల్లో 489 మందికి ఇటీవల 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఎంటీఎస్‌పై ఉద్యోగాలిచ్చారు. బదిలీల్లో వీరివి వర్కింగ్‌ సర్‌     ప్లస్‌గా చూపుతారు. బదిలీల తర్వాత ఏర్పడే ఖాళీల్లో మళ్లీ కౌన్సెలింగ్‌ విధానంలో నియమించనున్నట్లు విద్యాశాఖ చెబుతోంది.

 ఎందుకీ పరిస్థితి?  

ప్రభుత్వ విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, హేతుబద్ధీకరణతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. 2022లో చేపట్టిన రేషనలైజేషన్‌ ద్వారా 1,483 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నట్లు స్పష్టమైంది. గత బదిలీల్లో బ్లాక్‌ చేసిన 900 పోస్టులు ఇందులో ఉన్నాయి. మిగిలిన 583 పోస్టులు ఉద్యోగోన్నతులు, విరమణ, చనిపోవడం తదితర రూపాల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆదర్శ పాఠశాలలు, కర్నూలు జిల్లాలో స్థాయి పెంచిన పాఠశాలల కోసం జిల్లా నుంచి కొన్ని ఎస్జీటీ, సహాయకుల పోస్టులను సర్దుబాటు చేశారు. కొన్నింటికి అవసరమైన సబ్జెక్టులకు మళ్లించి (కన్‌వర్షన్‌) ప్రతి పాఠశాలలో పాఠ్యాంశ ఉపాధ్యాయుల నుంచి ఎస్జీటీల వరకు సర్దుబాటు చేశారు. 30 శాతం నేరుగా నియామక ఖాళీల్లోనూ ఉద్యోగోన్నతులు కల్పించినా, ఇంకా 620 ఎస్జీటీ ఖాళీలు మిగులు ఉన్నట్లు అప్పట్లో విద్యాశాఖ వెల్లడించింది.

నిబంధనలివీ..

* జిల్లా, మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం బ్లాక్‌ చేస్తారు.

* నాన్‌ మ్యాపింగ్‌ పాఠశాలలు (6-10), 90 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలల్లోని కొన్ని ఖాళీలు మాత్రమే చూపుతారు.

* ప్రాథమికంలో 30 కన్నా తక్కువ మంది విద్యార్థులుంటే.. రెండు పోస్టుల్లో ఒకటి బ్లాక్‌ జాబితాలో పెడతారు.

ఉపాధ్యాయులు  ఏమంటున్నారంటే..

నచ్చిన ప్రదేశాలు కోరుకునే అవకాశం ఉండదు.

* భవిష్యత్తులో రద్దు చేయొచ్చు.

* ఎంటీఎస్‌, అంతర జిల్లాల బదిలీలపై వచ్చిన వారికి ఇవ్వడంతో రెగ్యులర్‌ వారు నష్టపోతున్నారు.

* బ్లాక్‌ చేసిన ఖాళీల్లో బదిలీల తర్వాత అక్కడక్కడ కొందరికి పోస్టింగ్‌ ఇవ్వడం, ఉద్దేశపూర్వకంగా కౌన్సెలింగ్‌కు దూరంగా ఉన్నవారికి కేటాయించిన సందర్భాలు ఉంటున్నాయి.

* బ్లాక్‌ చేసిన పాఠశాలల్లో భర్తీ జరగకపోవడంతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం  అవుతారు.

* కొంతకాలంగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు దగ్గరకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి.


హేతుబద్ధీకరణలో ఇలా..

మిగులు పోస్టులు : 2,330

ప్రభుత్వ యాజమాన్యం : 158

జడ్పీ యాజమాన్యం   : 2,172

మిగులు ఖాళీలు : 1,483

నికర ఖాళీలు : 847

ప్రభుత్వం : 25

జడ్పీ : 822

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని