logo

అక్షరంపై అంకుశం

విద్యల నగరంగా ఖ్యాతి పొందిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు నిరక్ష్యరాస్యతశాపంగా మారుతోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత అక్షరాస్యతలో జిల్లాది రాష్ట్రంలో అట్టడుగు స్థానమే.

Published : 08 May 2024 04:39 IST

తెదేపాలో జాతీయ గుర్తింపు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: విద్యల నగరంగా ఖ్యాతి పొందిన ఉమ్మడి విజయనగరం జిల్లాకు నిరక్ష్యరాస్యతశాపంగా మారుతోంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత అక్షరాస్యతలో జిల్లాది రాష్ట్రంలో అట్టడుగు స్థానమే. అక్షరాస్యత కోసం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలే దిక్కవుతున్నాయి. గతం ప్రభుత్వం అక్షరాస్యత కోసం ఒకప్పుడు ఉద్యమంగా చేపట్టిన కార్యక్రమాలు జగన్‌ ప్రభుత్వంలో పూర్తిగా దూరమయ్యాయి. పేదరికం, వలసల కారణంగా చదువుకు దూరమవుతున్న పిల్లలను బడికి తీసుకొచ్చే ప్రయత్నాలు నీరుగారిపోయాయి. అక్షరాస్యులను చేసినట్లు లెక్కల్లో చూపిన వారికి ఎన్‌ఐఓఎస్‌ (జాతీయ అక్షరాస్యత పరీక్ష) పరీక్షను నిర్వహించలేక విమర్శల పాలైంది.

ఆ.. లెక్కలు చెల్లవు!

జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటికి ఉమ్మడి జిల్లాలో ఇంకా 1.92 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు. పురుషులు 85,641 మహిళలు 1,06,573  ఉన్నట్లు తేల్చారు. వైకాపాలో 2021 నవంబరు నుంచి 2022 ఫిబ్రవరి వరకు కేంద్రం అమలుచేసిన పఢ్‌నా -లిఖ్‌నా అభియాన్‌ కార్యక్రమం ద్వారా  22,758 మందిని అక్షరాస్యులుగా చేసినట్లు ప్రకటించారు. వీరికి థర్డ్‌పార్టీ ద్వారా ఎన్‌ఐవోఎస్‌ (జాతీయ అక్షరాస్యత పరీక్ష) పరీక్ష నిర్వహించాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే అక్షరాస్యులుగా పరిగణిస్తారు. నిర్వహించక పోవడంతో అక్షరాస్యులైనట్లు ధ్రువపత్రాలిచ్చినా చెల్లదని కేంద్రం స్పష్టం చేయడంతో విమర్శల పాలైంది. సాక్షర భారత్‌ కార్యక్రమంలో నమోదైనవారికి తెదేపా ప్రభుత్వంలో మూడు విడతలుగా జాతీయ అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. 1,79,889 మంది పరీక్షకు హాజరైతే 1,43,816  ఉత్తీర్ణులయ్యారు. వీరికి అక్షరాస్యత ధ్రువపత్రాలు అందజేశారు. గతంలో ఉన్న సమాంతర విద్య కూడా ఈ ప్రభుత్వం నిలిపి వేయడంతో అక్షరాస్యులైన వారి భవిష్యత్తు అగమ్యగోచరమైంది.

గత ప్రభుత్వం..

తెదేపా అక్షరాస్యతకు పెద్దపీట వేసేలా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు తోడుగా రాష్ట్రంలో అక్షర విజయం, అక్షర సంక్రాంతి, చదువుల పండగ తదితర పథకాలను అమలుచేసింది. ఇవన్నీ పెద్ద ఎత్తున ఉద్యమంగా సాగాయి.

ప్రస్తుతం..

వైకాపా ప్రభుత్వం అయిదేళ్లలో ఒక్క కార్యక్రమాన్ని తెచ్చిన పాపాన పోలేదు. కేంద్రం అమలు చేసిన పఢ్‌నా ..లిఖ్‌నా కార్యక్రమంతోనే మమ అనిపించింది. కనీసం వారికి ఎన్‌ఐఓస్‌ పరీక్షను నిర్వహించలేకపోయింది. ఫలితంగా అక్షరాలు నేర్చుకున్న వారు నిరక్షరాస్యులుగా మిగిలి పోవాల్సి వచ్చింది.

అయిదేళ్లలో రూ.5 లక్షలేË

కేంద్ర ప్రభుత్వ పరంగా రెండు ప్రభుత్వాల్లో సాక్షర భారత్‌, పఢ్‌నా లిఖ్‌నా కార్యక్రమాలు నిర్వహించారు. తెదేపాలో అమలైన సాక్షర్‌భారత్‌ కార్యక్రమంలో 4,18,214 మంది అక్షరాస్యులయ్యారు. వైకాపా హయాంలో పఢ్‌నా లిఖ్‌నా కార్యక్రమం ద్వారా 22,758 మందినే అక్షరాస్యులను చేసినట్లు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. కార్యక్రమాల అమలుకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులు భరించాలి. తెదేపా ప్రభుత్వంలో అమలైన సాక్షరభారత్‌ పథకానికి సిబ్బంది జీతాలు కలుపుకుని రూ.11 కోట్ల నిధులు జిల్లాకు మంజూరయ్యాయి. వైకాపా ప్రభుత్వంలో అమలుచేసిన పఢ్‌నా  లిఖ్‌నా కార్యక్రమం అయిదు లక్షలు మాత్రమే జిల్లాకు మంజూరు చేసింది. ఇందులో రూ.4లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది.

చిట్టిగురువుల కార్యక్రమం (విద్యార్థులే తల్లిదండ్రులు కుటుంబసభ్యులకు చదువు చెప్పడం) ఇది కొంత అక్షరాస్యత సాధనకు తోడ్పడింది. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు తన దత్తత గ్రామమైన ద్వారపూడి, ముగడ గ్రామాల్లో అమలుచేశారు. మంచి ఫలితాలు రావడంతో జాతీయస్థాయిలో గుర్తింపునందుకుంది. ప్రధాని మోదీ మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రశంసించారు. ఉమ్మడి జిల్లాలో 2018- 2019లో జిల్లాలో ప్రయోగాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం ద్వారా 28,627 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. జిల్లా పునర్విభజన తర్వాత అప్పటి కలెక్టర్‌ సూర్యకుమారి చొరవతో విజయనగరం జిల్లాలో 2022 జూన్‌ నుంచి 2023 జనవరి వరకు అమలుచేశారు. కార్యక్రమంలో నమోదైన 92,058 మందిలో 86,997 మందికి రాతపరీక్ష ద్వారా ఏ,బి గ్రేడ్‌ల్లో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి నిధులు లేకపోవడంతో రూ.20 లక్షల వరకు జిల్లా పరిషత్తు (రీఎంబర్స్‌ విధానంలో), దాతల సహకారంతోనే నిధులు సమకూర్చారు. వీరికి ఎన్‌ఐవోఎస్‌ పరీక్షలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు