logo

విజయనగరం గడ్డపై పసుపు జెండా ఎగరాలి

కేంద్రంలో మనకోసం స్వరం విప్పే ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు. ఆయన్ను గెలిపించి పార్లమెంట్‌లో అడుగు పెట్టించాలి.

Published : 08 May 2024 04:51 IST

  • కేంద్రంలో మనకోసం స్వరం విప్పే ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు. ఆయన్ను గెలిపించి పార్లమెంట్‌లో అడుగు పెట్టించాలి.
  • అశోక్‌గజపతిరాజు ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి అదితి గజపతిరాజు.. దారి తప్పిన విజయనగరాన్ని మళ్లీ దారిలో పెట్టాలంటే ఆమెను గెలిపించి శాసనసభకు పంపించాలి.

విజయనగరం అర్బన్‌, పట్టణం, కోట, రింగురోడ్డు, న్యూస్‌టుడే: విజయనగరం గడ్డపై పసుపుజెండా ఎగరాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలోని అయోధ్య మైదానంలో జరిగిన యువగళం సభలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలోనే విజయనగరం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ‘గోస్తనీ, చంపావతి ద్వారా నగరానికి తాగునీరందించే ప్రాజెక్టులు రూపొందించాô. ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, రోడ్లు, సంతకాల వంతెన, బైపాస్‌లు నిర్మించాం. మహారాజా ఆసుపత్రిని 300 పడకలుగా తీర్చిదిద్దాం.. నిరుపేదలకు సొంత ఇళ్ల కోసం పెద్దఎత్తున టిడ్కో గృహాలు కట్టాం’ అని పేర్కొన్నారు. ‘తోటపల్లి ప్రాజెక్టును ఎంతో అభివృద్ధి చేశాం. ఈ ప్రభుత్వం పైసా వెచ్చించలేదు. భోగాపురం విమానాశ్రయానికి అశోక్‌ నాయకత్వంలో భూసేకరణ జరిగింది. వైకాపా వచ్చి మేం శంకుస్థాపన చేసిన రాయిని పగులకొట్టి మళ్లీ శంకుస్థాపన చేశారని’ విమర్శించారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థిని అదితి గజపతిరాజు, పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

యువగళం సభకు తరలివచ్చిన యువత, మహిళలు, తెదేపా అభిమానులు

మీ బాధ్యత నేను తీసుకుంటా

ఓటు మీదే యువత భవిష్యత్తు ఆధారపడి ఉంది. చాలా మంది తొలిసారి వేసే వారు ఉన్నారు. ఆలోచించాలి.  అయిదేళ్లు ఉద్యోగాలు, ఉపాధి లేక నష్టపోయారు. ఏపీని జాబ్‌ ఛార్ట్‌లోకి తేవాలంటే.. తెదేపాను గెలిపించాలి. మళ్లీ ఉత్తరాంధ్రపై శ్రద్ధపెడతా. కష్టపడి.. పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి, ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా.

బొత్స కుటుంబం కేన్సర్‌లా తినేస్తోంది

‘2019లో బొత్స కుటుంబాన్ని గెలిపించారు. వారి కుటుంబ సభ్యులు కేన్సర్‌లా తినేస్తున్నారు. మన మీద పడి దోచుకుంటున్నారు. వారి వల్ల ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? బొత్స సత్తిబాబు, అప్పలనర్సయ్య, చిన్న శ్రీను, బెల్లాన చంద్రశేఖర్‌, బడ్డుకొండ అప్పలనాయుడు బాగుపడ్డారు.. వారి కంపెనీల ఆదాయం పెరిగిందని’ విమర్శించారు.

క్రీడాకారులకు ఏం చేస్తారు?: ప్రసాద్‌

క్రీడల్లో ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు. నేను బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడ్ని. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఆడేందుకు సాధన చేస్తున్నా. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాలాంటి వారికి ఏం చేస్తారు?

లోకేశ్‌: అంతర్జాతీయ స్థాయిలో గోపీచంద్‌ బంగారు పతకం తీసుకొస్తే.. అనువైన భూమి ఇచ్చి హైదరాబాద్‌లో అకాడమీ పెట్టించాం. మినీ, ఇండోర్‌ స్టేడియాలు నిర్మించాం. జగన్‌లా బటన్‌ నొక్కడం కాదు. విజన్‌ ఉండాలి. క్రీడారంగాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.

ఎంతో దోచుకున్నారు: హైమా

రాష్ట్రం అప్పులపాలైంది. ఎంతో దోచుకున్నారు. ఈ ప్రభుత్వం ఎంత దోచుకుందో మీకు తెలిస్తే చెప్పండి?

లోకేశ్‌: అవినీతి, అక్రమాల ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు ఎంత మింగారో లెక్కలు తీసి కక్కిస్తాం. ఇసుక, భూములు, మద్యం అమ్మకాల్లో రూ.వేల కోట్లు దోచేశారు. మీరు కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించండి. తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాం.

రాజధాని లేదని చెబుతున్నాం..: వనిత

దేశంలో ఏ రాష్ట్రానికీ లేని దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఉంది. రాజధాని లేదని చెప్పుకొంటున్నాం. మీరు అమరావతి అంటారు. వాళ్లు మూడు రాజధానులంటారు. ఇంతకీ రాజధాని నిర్మాణం ఎప్పుడు?

లోకేశ్‌: రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉంటుందని రాజధానిగా అమరావతిని అప్పట్లో మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిపక్షంలో ఉన్న వైకాపా మద్దతు పలికింది. సచివాలయం, శాసనసభ, శాసనమండలి అన్నీ నిర్మించుకున్నాం. అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా మూడు ముక్కలాట ప్రారంభించింది. మన జీవితాలతో ఆడుకుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని రాజధానిగా ప్రకటించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు