logo

అన్నదాతకు ఇక సంక్షేమమే

వ్యవసాయాన్ని బంగారం చేసేందుకు, రైతులను ఆదుకునేందుకు ఎన్టీయే కూటమి ముందుకు వచ్చింది. సేద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుము బిగించింది.

Published : 10 May 2024 03:03 IST

ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం
90 శాతం రాయితీతో బిందుసేద్యం
న్యూస్‌టుడే, రాజాం

వ్యవసాయాన్ని బంగారం చేసేందుకు, రైతులను ఆదుకునేందుకు ఎన్టీయే కూటమి ముందుకు వచ్చింది. సేద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుము బిగించింది. ఇప్పటికే తాము అధికారంలోకి వచ్చాక ఇవ్వనున్న సంక్షేమ పథకాలను ప్రకటించి కొండంత ధైర్యం నింపారు.

జగన్‌ ఏలుబడి

ఎన్నికల ముందు జగన్‌ ఒక్కో రైతుకు రూ.12,500 ఇస్తామని ప్రకటించారు. ఈ సమయంలోనే కేంద్రం పీఎం కిసాన్‌ కింద రూ.6 వేలను నేరుగా అందిస్తోంది. ఈ రెండు కలిపితే రూ.18,500  జమ చేయాలి. కానీ కేంద్రం ఇచ్చిన సాయాన్ని తన ఖాతాలో కలిపేసుకుని రూ.13,500 పరిమితం చేశారు. ఈ లెక్కన ఒక్కో రైతుకు రూ.5 వేలు కోత పడింది. అదీ మూడు విడతల్లో జమ చేస్తూ వచ్చారు. ఒకే కుటుంబంలో భూములున్న రైతులు ఎందరున్నా.. ఒక్కరికే సాయాన్ని అందించారు.

కూటమి.. ఏటా రూ.20 వేలు

కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున అయిదేళ్లలో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. నిజంగా ఇది పండగే. పెట్టుబడులకు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.

బిందు సేద్యానికి ఊపిరి

విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో మళ్లీ బిందుసేద్యం ఊపిరిలూదుకోనుంది. ఏకంగా 90 శాతం రాయితీ అందిస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు. తెదేపా అధికారంలో ఉన్న అయిదేళ్లూ ఈ పథకం కింద 4,200 హెక్టార్లలో తుంపర సేద్యం, 7,331 హెక్టార్లలో బిందు సేద్యం పరికరాలు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. అయిదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితం, ఇతర రైతులకు పరికరాలపై 90% రాయితీ ఇచ్చి ఉదారత చాటుకున్నారు. 5-10 ఎకరాల్లోపు అయితే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90%, ఇతరులకు 70% రాయితీ వర్తించేది.

అటకెక్కించిన వైకాపా

వైకాపా అధికారంలోకి వచ్చాక అటకెక్కించే శారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో  2022లో తిరిగి అమలు చేస్తామని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించారు. అయిదెకరాల లోపు  బిందు సేద్యానికి 90%, తుంపరకు 50%, 12.50  ఎకరాల వరకు బిందు 50%, తుంపర సేద్యానికి 45% రాయితీ ఇస్తామన్నా ఒక్కరికీ  ఇవ్వలేదు.

కర్షకుల భూములకు భరోసా

భూములను చెరబట్టేలా వైకాపా తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చూసి అన్నదాతలు వణికిపోతున్నారు. వివాదాలు తలెత్తితే పరిష్కరించుకోవడానికి ఏకంగా హైకోర్టు వరకూ వెళ్లాలంటే అందరికీ సాధ్యం కాని పని. రెండు జిల్లాల్లోని 5.49 లక్షల మంది రైతుల్లో 95 శాతానికి పైగా సన్న, చిన్నకారు రైతులే. ఇంతటి వివాదాస్పదమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి హామీ ఇచ్చింది. ఇది రైతులకు ఊరట కలిగించే అంశం. తమ భూములు ఏమైపోతాయోననే బెంగ లేకుండా హాయిగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోవచ్చు.

రాయితీపై యంత్ర పరికరాలు

రైతులకు సాగులో వ్యవసాయ పరికరాలు అత్యంత కీలకం. వీటిని పూర్తి ధర వెచ్చించి కొనుగోలు చేసే శక్తి సన్న, చిన్నకారు రైతులకు ఉండదు. అందుకే గతంలో తెదేపా ప్రభుత్వం రాయితీపై వీటిని పెద్ద ఎత్తున అందించేది. కాలాన్ని అనుసరించి అన్నదాతలకు పవర్‌ టిల్లర్లు, నూర్పు యంత్రాలు, స్ప్రేయర్లు, టార్పాలిన్లు, బ్రష్‌ కట్టర్లు, తదితర వాటిని 50 శాతం రాయితీపై వ్యవసాయ, ఉద్యాన శాఖ ద్వారా సమకూర్చేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేసింది. ఆర్బీకేల పరిధిలో గ్రూపులు ఏర్పాటు చేసి వారికి మాత్రమే యంత్రాలు ఇచ్చి మిగిలిన రైతులు అద్దెకు తీసుకోవాలని నిర్దేశించింది. రైతుల అవస్థలు, బాధలను గుర్తించి తెదేపా కూటమి తిరిగి ఈ పథకాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.

వ్యవసాయ కూలీలకు కార్పొరేషన్‌

రైతులకే కాదు.. రైతు కూలీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలవనుంది. రెండు జిల్లాల్లో వీరి సంఖ్య ఎక్కువ. పూర్తిస్థాయిలో పనులు లభ్యం కాకపోవడంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. కార్పొరేషన్‌ ఓ సంజీవని కానుంది.

ధరల స్థిరీకరణ నిధికి హామీ

ఉమ్మడి జిల్లాలో వైకాపా పెద్దలు, మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట క్వింటాకు 7-10 కిలోల ధాన్యం అదనంగా తీసుకున్నారు. కూటమి మేనిఫెస్టోలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని