logo

ఆగమేఘాలపై బదలాయింపు

మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ, పరిపాలన బాధ్యతలు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నగరపాలక, పురపాలక కమిషనర్లు వెంటనే వీటిని అప్పగించాలని పేర్కొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు. ఎవరైనా న్యాయపరంగా అడ్డుకు

Published : 25 Jun 2022 03:15 IST

మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ డీఈవో పరిధిలోకి...


నగరంలోని రాజపానగల్‌ రోడ్డులోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ, పరిపాలన బాధ్యతలు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)లకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నగరపాలక, పురపాలక కమిషనర్లు వెంటనే వీటిని అప్పగించాలని పేర్కొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు. ఎవరైనా న్యాయపరంగా అడ్డుకునే అవకాశం లేకుండా జీవో ఇచ్చిన రోజే బదలాయింపు చేపట్టారని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపల్‌ పాఠశాలలను ఆస్తులతో సహా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని తొలుత ఆదేశాలివ్వగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. అధికారపార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చాలాచోట్ల ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో ఆస్తులు మున్సిపాలిటీలకే ఉంచేలా మార్గదర్శకాలిచ్చింది.

ఒంగోలు, మార్కాపురంలో..:

ఒంగోలులో నాలుగు మున్సిపల్‌ ఉన్నత, ఒక ప్రాథమికోన్నత, 16 ప్రాథమిక పాఠశాలున్నాయి. 129 మంది ఉపాధ్యాయులు, 23 మంది కంటింజెంట్‌, 15 మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. మార్కాపురంలో మూడు ఉన్నత, ఒక ప్రాథమికోన్నత, 13 ప్రాథమిక పాఠశాలలున్నాయి. 65 మంది ఉపాధ్యాయులు, 17 మంది కంటింజెంట్‌ ఉద్యోగులున్నారు. తాత్కాలిక ఉద్యోగుల స్థానంలో విద్యాశాఖ కొత్తవారిని నియమిస్తుంది. అప్పటివరకు ఇబ్బంది లేకుండా వారినే కొనసాగిస్తారు. టీచర్లు, స్వీపర్లు డీఈవో పరిధిలోకి వెళతారు. వారి పదోన్నతులు, బదిలీలు, కొత్త నియామకాలు ఇకపై ఆయన చేపడతారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న విధంగానే సీనియర్‌ హెచ్‌ఎం పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు. కాగా ఉపాధ్యాయుల వేతనాల బిల్లులు ఎవరు చేయాలి? డ్రాయింగ్‌ అధికారం ఎవరికనేది స్పష్టత లేదని చెబుతున్నారు. సర్వీసు నిబంధనలు ఏ విధంగా అమలు చేస్తారు..రిజిస్టర్లు ఎవరి ఆధీనంలో ఉంటాయనేది కూడా అయోమయమే. నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావును సమాచారం కోరగా సీడీఎంఏ జీవో ఇచ్చారని, దానికి అనుగుణంగా మార్గదర్శకాలు రావాలన్నారు. పర్యవేక్షణ, పాలన మాత్రమే విద్యాశాఖ కిందికి వెళతాయని, ఆస్తులు స్థానిక సంస్థలకే ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని