logo

నేను బానిసగా పనిచేయను

ఆయన బ్రిటీష్‌ వారు ఇచ్చిన డిప్యూటీ కలెక్టర్‌ పదవినే తిరస్కరించారు...పోలీసు నిర్బంధాన్ని నిరసిస్తూ మూడు రోజులు ఉప్పు మాత్రమే తీసుకుని నిరాహార దీక్ష చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 11 నెలలు జైలు శిక్ష అనుభవించారు.. ‘నేను మతాన్ని...అల్లాని గౌరవిస్తాను.. భారతీయుడు అని పిలిస్తే అంతకన్నా

Published : 10 Aug 2022 03:23 IST

ఆంగ్లేయులను ఎదిరించిన సయ్యద్‌ షా మొహియుద్దీన్‌

ఆయన బ్రిటీష్‌ వారు ఇచ్చిన డిప్యూటీ కలెక్టర్‌ పదవినే తిరస్కరించారు...పోలీసు నిర్బంధాన్ని నిరసిస్తూ మూడు రోజులు ఉప్పు మాత్రమే తీసుకుని నిరాహార దీక్ష చేశారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 11 నెలలు జైలు శిక్ష అనుభవించారు.. ‘నేను మతాన్ని...అల్లాని గౌరవిస్తాను.. భారతీయుడు అని పిలిస్తే అంతకన్నా గర్వపడతాను’ అని పేర్కొన్నారు. ఆ స్వాతంత్య్ర సమరయోధుడే సయ్యద్‌ షా మొహియుద్దీన్‌ ఖాద్రీ బియబానీ. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా ఒక్కసారి తెలుసుకుంటే..

సయ్యద్‌ షా 1894లో కంభంలో జన్మించారు. ఈ ప్రాంతం నాడు కర్నూలు జిల్లా పరిధిలో ఉండేది. తండ్రి సయ్యద్‌ గౌస్‌ పీర్‌ ఖాద్రీ ప్రముఖ వైద్యుడు. తల్లి రుఖియాబి. కంభం ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన సయ్యద్‌ షా మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో పట్టభద్రుడై అలీఘఢ్‌లోని మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్‌ కళాశాలలో న్యాయవిద్యలో చేరారు. అక్కడే డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌తో పరిచయం ఏర్పడి భారత జాతీయ ఉద్యమం వైపు మళ్లారు. ఉద్యమ నాయకులైన డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ వంటివారిని రహస్యంగా కలిశారన్న కారణంగా పోలీసులు సయ్యద్‌ షాను అరెస్టు చేశారు. ఈ నిర్బంధంపై మూడు రోజులపాటు నిరాహారదీక్ష చేసి కేవలం ఉప్పు తిని నిరసన తెలిపారు. ఆగ్రా జైలులో ఉన్నప్పుడు మౌలానా అబుల్‌ కలాం అజాద్‌తో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘తఫ్సీర్‌ ఈ ఖురాన్‌’ రచనలో అజాద్‌కు సహాయపడ్డారు. బ్రిటీష్‌ పాలకుల విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. సయ్యద్‌ షాకు బ్రిటీష్‌ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ పోస్టును ఆశచూపింది. దాన్ని తిరస్కరించిన ఆయన ‘అంగ్రేజోంకా గులాంగిరీ నహీ కరుంగా (బ్రిటీష్‌ వారికి బానిసగా పనిచేయను.) అని సగర్వంగా ప్రకటించి దేశభక్తి చాటారు.

భారతీయుడిగా గర్వపడతా

1923 మేలో కాన్పూర్‌లో జరిగిన జాతీయ జెండా ఉద్యమంలో ఆంధ్రా ఫ్రావిన్సియల్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా సయ్యద్‌ షా పాల్గొన్నారు. తర్వాత జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు 11 నెలల జైలు శిక్ష అనుభవించారు. చివరివరకు మహాత్మాగాంధీ మార్గాన్ని అనుసరించిన సయ్యద్‌ షా.. భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి 500 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయోద్యమంలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 15 ఎకరాల భూమిని ఇచ్చింది. దానిని కూడా విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా పనిచేసిన ఆయన 1969 అక్టోబరు 1న తుదిశ్వాస విడిచారు.

-ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని