logo

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యాపారి దుర్మరణం

స్థానిక గంగవరం రోడ్డులో ఉన్న రైల్వే వంతెన సమీపంలో మంగళవారం మధ్యాహ్నం షేక్‌ మస్తాన్‌ బాషా(45) అనే వ్యక్తి ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం దర్శికి చెందిన షేక్‌ మస్తాన్‌ బాషా వడ్డీ వ్యాపారం

Published : 28 Sep 2022 02:25 IST

మస్తాన్‌ బాషా (పాత చిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: స్థానిక గంగవరం రోడ్డులో ఉన్న రైల్వే వంతెన సమీపంలో మంగళవారం మధ్యాహ్నం షేక్‌ మస్తాన్‌ బాషా(45) అనే వ్యక్తి ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం దర్శికి చెందిన షేక్‌ మస్తాన్‌ బాషా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, తపాలా కార్యాలయంలో ఏజెంటుగా పనిచేస్తున్నారు. పనుల నిమిత్తం గంగవరం వెళ్లి తన ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామం వస్తున్నారు. రైల్వే వంతెన సమీపంలో వెనుక వైపు నుంచి గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో ఆయనకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు. మృతునికి భార్య, వివాహమైన కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


ఐటీడీపీ కోఆర్డినేటర్‌పై వైకాపా నాయకుల దాడి
 పరస్పర కేసుల నమోదు

వెలిగండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని మొగుళ్లూరుకు చెందిన చేపల వ్యాపారి, ఐటీడీపీ కోఆర్డినేటర్‌ చింతగుంట్ల నరేంద్రపై వైకాపా నాయకులు దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వినాయక చవితి ఉత్సవాలను వైకాపా కన్నా ఐటీడీపీ కోఆర్డినేటర్‌ బాగా చేశారని కక్ష పెంచుకున్న స్థానిక సర్పంచి భర్త కోటేశ్వరరావు, అతని అనుచరులు సోమవారం రాత్రి మద్యం తాగి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానం వద్దకు వచ్చారు. ఆ సమయంలో నరేంద్ర మినీ లారీలోని చేపలు మార్చే పనులు పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో రెచ్చగొట్టి, దేవస్థానం వద్ద చేపలు అన్‌లోడింగ్‌ చేయడమేమిటని గొడవ పెట్టుకున్నారు. తనను గాయపరిచారని కనిగిరి సీˆహెచ్‌సీˆలో చికిత్స పొందుతూ బాధితుడు నరేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇదే విషయమై ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద చేపలు దించవద్దని ప్రశ్నించినందుకు ఐటీడీపీ కోఆర్డినేటర్‌ నరేంద్ర మద్యం తాగి తమపై దాడి చేశారని సర్పంచి భర్త కోటేశ్వరరావు, ఇతర వైకాపా నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరస్పర కేసులు నమోదు చేసినట్లు ఎస్సై విశ్వనాథరెడ్డి తెలిపారు. నరేంద్రను తెదేపా నాయకులు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, షేక్‌ షరీఫ్‌, వేణుగోపాల్‌ తదితరులు పరామర్శించారు.


‘సింగ్‌ది హత్య కాదు.. అనూహ్య మరణం’

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు చెరువుకొమ్ముపాలెంలోని సదరన్‌ రాక్స్‌ వద్ద ఈ నెల 15న గంగేశ్వర్‌ సింగ్‌(25) మృతికి హత్య కారణం కాదనీ, అది అనూహ్యంగా చోటుచేసుకున్న మరణంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. గంగేశ్వర్‌ సింగ్‌ రక్తపు మడుగులో పడి ఉండటంతో ఇది తొలుత హత్యగా భావించినట్టు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై అదనపు ఎస్పీ పర్యవేక్షణలో అన్ని కోణాల్లో నిశిత పరిశీలన చేసినట్టు తెలిపారు. కుడి చేతి మణికట్టు పైన లోతైన గాయం ఉందనీ, రక్తస్రావం అధికం కావటంతో అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారన్నారు. గంగేశ్వర్‌ సింగ్‌ మృతి చెందిన సమయంలో ఆ గదిలోని ఓం కుమార్‌ అలియాస్‌ ఓం ప్రకాష్‌, కైలాష్‌ అజ్ఞాతంలోకి వెళ్లడంతో తొలుత దీన్ని హత్యగా భావించామని.. పలువురిని విచారించడంతో పాటు, సీసీ టీవీ ఫుటేజీ, సీడీఆర్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించినట్టు వివరించారు. తమ దర్యాప్తులో అది అనూహ్యంగా సంభవించిన మరణంగానే తేలినట్లు ఎస్పీ గార్గ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని