logo

ఖజానా శాఖలో ఉద్యోగాలంటూ మోసం

ఖజానా శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కుంచాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తమ వద్ద రూ.రెండు లక్షలు చొప్పున డబ్బులు తీసుకుని మోసగించాడని వెలిగండ్ల మండలం తమ్మినేనిపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని పెద్దిరెడ్డి పోలీసు స్పందనలో సోమవారం ఫిర్యాదు చేశారు.

Published : 29 Nov 2022 02:17 IST

బాధితుల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఖజానా శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కుంచాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తమ వద్ద రూ.రెండు లక్షలు చొప్పున డబ్బులు తీసుకుని మోసగించాడని వెలిగండ్ల మండలం తమ్మినేనిపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని పెద్దిరెడ్డి పోలీసు స్పందనలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఒంగోలులోని ఖజానా కార్యాలయంలో పనిచేస్తున్న కుంచాల వెంకటేశ్వర్లు తనతో పాటు తమ గ్రామానికే చెందిన మరో ఇద్దరి వద్ద నుంచి ఇదే తరహా మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశాడని అందులో పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పించలేదనీ, అదేమంటే బెదిరిస్తున్నాడని ఎస్పీ మలికా గార్గ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
* నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన నున్న వెంకట సురేంద్రనాథ్‌ అనే వ్యక్తి తన వద్ద నుంచి గ్రానైట్‌ రాళ్లను కొనుగోలు చేసి అయిదు నెలలుగా డబ్బులివ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని గ్లోబల్‌ గ్రానైట్‌ కటింగ్‌ ఫ్యాక్టరీకి చెందిన బాచిన ఆంజనేయులు ఎస్పీ గార్గ్‌కు విన్నవించారు. సురేంద్రనాథ్‌ వద్ద నుంచి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని విన్నవించారు.జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి 94 మంది ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. పలువురితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు(అడ్మిన్‌), యు.వి.శ్రీధర్‌రావు(క్రైమ్స్‌), ఎస్బీ డీఎస్పీ మరియదాసు, ఐసీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి.రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

వినతిపత్రం అందించిన అనంతరం సమస్యను వివరిస్తున్న బాధితులు


కాంపౌండర్‌ మృతిపై నిజాలు నిగ్గుతేల్చాలి...

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్న బండ్లమిట్ట నివాసి దేవరకొండ మణికంఠ రాకేష్‌ మృతిపై అనుమానాలున్నాయని.. విచారించి నిజాలు నిగ్గుతేల్చాలని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు మలగా రమేష్‌ కోరారు. ఈ మేరకు ఎస్పీ మలికాగార్గ్‌ను బాధిత కుటుంబ సభ్యులతో సోమవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. రాజేష్‌ మృతిచెంది మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు శవ పరీక్ష నివేదిక ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 3వ తేదీ రాత్రి అత్యవసర కేసు చికిత్స కోసం ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లిన అతను.. 4న శవమై ఆసుపత్రిలో బంధువులకు కనిపించాడన్నారు. ఈ ఉదంతంపై విచారించి దోషులను శిక్షించాలని కోరారు. ఎస్పీకి వినతిపత్రం అందజేసిన వారిలో జనసేన నాయకులు రాయిని రమేష్‌, ప్రమీల, కోమలి, ఉష, బ్రహ్మనాయుడు తదితరులున్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని