logo

అధికారంలో ధిక్కార స్వరాలు

అదిలింపులకు అదరలేదు. బెదిరింపులకు భయపడ లేదు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేసినా బెట్టు వీడలేదు.

Published : 06 Feb 2023 01:51 IST

అదిలింపులు.. బెదిరింపులు బేఖాతరు

పార్టీ, పదవుల్లో ప్రాధాన్యానికి డిమాండ్‌
పన్నెండు మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

ఒంగోలులోని ఓ కల్యాణ మండపంలో సమావేశమైన వైకాపా
సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులు

అదిలింపులకు అదరలేదు. బెదిరింపులకు భయపడ లేదు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేసినా బెట్టు వీడలేదు. మాజీ మంత్రి నచ్చజెప్పజూసినా ససేమిరా వినలేదు. నిర్ణయించుకున్నట్టుగానే సమావేశమయ్యారు. ఆత్మీయ సమావేశం అంటూనే రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో, పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సంతనూతలపాడు నియోజకవర్గ వైకాపాలో మళ్లీ రాజకీయ అలజడి రాజుకుంది. ఒంగోలు నగరం మంగమూరు రోడ్డులోని ఒక కల్యాణ మండపంలో ఆ పార్టీకి చెందిన ఓ సామాజికవర్గ నాయకులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కావడం ఇందుకు కారణం.

అడ్డుకునే యత్నం చేసినప్పటికీ...: ఓ సామాజికవర్గ నాయకుల సమావేశాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధాకర్‌బాబు శతవిధాలా ప్రయత్నించారు. పలువురు నాయకులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు. నచ్చజెప్పేందుకు చూశారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా తనవంతు ప్రయత్నం చేశారు. ప్రత్యేక సమావేశాలతో మరింత అలజడి సృష్టించొద్దని కోరారు. వీరికితోడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. తామేమీ పార్టీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేయబోమని, సాధకబాధకాలు మాట్లాడుకోవడానికే సమావేశమవుతున్నామంటూ ఆ వర్గం నాయకులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ సమావేశాన్ని అడ్డుకునేందుకు శనివారం రాత్రి వరకు శతవిధాలా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమావేశమైన నాయకులు తమ సమస్యలపై పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపుల కోసం మండలానికి ముగ్గురు చొప్పున మొత్తం 12 మందితో ప్రత్యేక కమిటీని ఎన్నుకున్నారు.

మేమేంటో చూపిస్తామంటూ హెచ్చరికలు...: సమావేశం అనంతరం ప్రత్యేక కమిటీ నాయకులు మారెళ్ల బంగారుబాబు, మండువ అప్పారావు, మలినేని వెంకటేశ్వర్లు అలియాస్‌ బుల్లబ్బాయి తదితరులు మీడియాతో మాట్లాడారు. పార్టీలో తమకున్న ఇబ్బందులపై చర్చించినట్టు చెప్పారు. ఒత్తిడి తెచ్చి తమను ఎవరూ ఆపలేరని అన్నారు. పార్టీలో ప్రాధాన్యం, గౌరవం దక్కనందునే సమావేశమైనట్టు తెలిపారు. తమ సామాజిక వర్గాన్ని విస్మరిస్తే పుట్టగతులుండవని, ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించేది లేదని హెచ్చరించారు. తాము వైకాపాకు విధేయులమని, తమను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు. మాకూ ఒక రోజు వస్తుందని. అప్పుడు తామేంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ సమావేశం సంతనూతలపాడు నియోజకవర్గ వైకాపాలో సంచలనంగా మారింది. పార్టీలో ఒక సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారనే అంశాన్ని బహిర్గతం చేసింది.

కోటంరెడ్డీ వైకాపా  బాధితుడే...

నెల్లూరు గ్రామీణ వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఒంగోలుకు చెందిన ఆ పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా సంఘీభావం ప్రకటించారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఫోన్‌ చేసి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చేసుకునే వ్యక్తికి శ్రీధర్‌రెడ్డిని బెదిరించే స్థాయి లేదన్నారు. తన మాదిరిగానే ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా వైకాపా బాధితుడేనని, రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేసినా తాను ఆ నియోజకవర్గంలో ఆయన తరఫున ప్రచారం చేస్తానని చెప్పారు. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని కూడా త్వరలోనే కలిసి సంఘీభావం ప్రకటిస్తానని సుబ్బారావు గుప్తా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని