logo

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

ఉదయపు నడకకు వెళ్లిన ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు మృతిచెందిన ఘటన కురిచేడు రోడ్డులోని పల్లెవనం పార్క్‌ సమీపంలో శుక్రవారం జరిగింది.

Published : 10 Jun 2023 05:52 IST

కోటిలింగం (పాత చిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: ఉదయపు నడకకు వెళ్లిన ఓ వృద్ధుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు మృతిచెందిన ఘటన కురిచేడు రోడ్డులోని పల్లెవనం పార్క్‌ సమీపంలో శుక్రవారం జరిగింది. వైద్య సిబ్బంది, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న భీమవరపు కోటిలింగం(60), రోజూ ఉదయం పల్లెవనం పార్క్‌లో వాకింగ్‌ చేసేవారు. అభివృద్ధి పనులు జరుగుతున్నందున పార్క్‌ మూసివేయడంతో కురిచేడు రోడ్డులో నడకకు వెళ్లారు. ఈ క్రమంలో పట్టణంలోకి వస్తున్న గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధుడి తలకు తీవ్ర గాయమైంది. 108 అంబులెన్సులో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్సకోసం ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారు. అతడికి భార్య చెన్నమ్మ ఉంది.


అడవి పందిని ఢీకొని..

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనానికి అడవి పంది అడ్డు రావడంతో దానిని ఢీకొని వాహనం బోల్తాపడిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మృతిచెందారు. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఇడుపూరు గ్రామానికి చెందిన యక్కంటి దిబ్బారెడ్డి (45) వ్యక్తిగత పనుల నిమిత్తం గురువారం మార్కాపురం పట్టణానికి వచ్చారు. తిరిగి ద్విచక్ర వాహనంపై రాత్రి ఇంటికి వెళ్తుండగా రహదారికి అడ్డంగా అడవి పంది వచ్చి ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దిబ్బారెడ్డిని గుర్తించిన స్థానికులు బంధువులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు క్షతగాత్రుడిని పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. దిబ్బారెడ్డికి భార్య, ఇద్దరూ కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు మార్కాపురం గ్రామీణ ఎస్సై సుమన్‌ తెలిపారు.


వడదెబ్బకు వృద్ధురాలి మృతి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: వడదెబ్బతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని తమ్మలూరు గ్రామానికి చెందిన అన్న వెంకాయమ్మ(88), ఎండ వేడిమికి గురువారం సాయంత్రం అస్వస్థకు గురికావడంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించారు. శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని