logo

ఆహా.. అలానా.. సరే.. చూద్దాంలే..!

‘మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం.. వేధింపులు, అత్యాచారాల నిరోధానికి ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం.. దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.

Published : 04 Jul 2023 03:26 IST

క్షణాల్లో కాదు.. రోజులుగా స్పందించని పోలీసులు
ఫిర్యాదులను ఉపేక్షిస్తున్న అధికారులు
ప్రశ్నార్థకంగా బాలికలు, మహిళల భద్రత

‘మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం.. వేధింపులు, అత్యాచారాల నిరోధానికి ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం.. దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. డౌన్లోడ్‌ చేసుకుని ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు చేతితో మూడుసార్లు గట్టిగా ఊపినా చాలు.. క్షణాల్లో పోలీసులు వచ్చేస్తారు. బాధితులకు రక్షణ కల్పిస్తారు...’ ఇదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గొప్పగా చేసుకుంటున్న ప్రచారం. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఫిర్యాదులు వస్తున్నప్పటికీ పోలీసులు సకాలంలో స్పందించడం లేదు. వేధిస్తున్నారంటూ పదే పదే విన్నవిస్తున్నప్పటికీ వినిపించుకోవడం లేదు. ఫలితంగా బాలికలు, మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. కీచక పర్వంలో కొందరు అభాగ్యులు బలవుతున్నారు.

ఈనాడు, ఒంగోలు,న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

క్షేత్రస్థాయిలో వాళ్లేం చేస్తున్నట్టు...

ప్రతి గ్రామం/ వార్డు పరిధిలో సచివాలయానికో మహిళా సంరక్షణ కార్యదర్శిని నియమించారు. అనంతరం వీరినే మహిళా పోలీసుగా మార్చి శాఖలో అంతర్భాగంగా పేర్కొంటున్నారు. వారం వారం వారి పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా తమకు తెలియాలని, అసాంఘిక శక్తులను గుర్తించి చర్యలు తీసుకునేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని చెబుతూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. బెదిరింపులు, లైంగిక వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నా పెద్దగా చర్యలు ఉండటం లేదు. మహిళలు, విద్యార్థినులు, చిన్నారుల పట్ల చోటుచేసుకునే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, వారిచ్చే ఫిర్యాదులపై సత్వరô స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రతి సమావేశంలోనూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయినా పట్టించుకున్న వారు ఉండటం లేదుఏ. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఒంగోలు బిలాల్‌నగర్‌లో పదహారేళ్ల యువతిని ఓ యువకుడు 15 రోజులపాటు ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన ఉదంతం.

పని ప్రదేశాల్లోనూ వేధింపుల పర్వం...

జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు లైంగికంగా వేధిస్తున్నారంటూ నాలుగు నెలల క్రితం ఓ మహిళా అధికారి దిశ మహిళా పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు తీసుకున్న అధికారులు జీజీహెచ్‌లో సహోద్యోగులను విచారించారు. ఆయనపై వచ్చిన అభియోగాలు నిజమేనని తేలడంతో స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఆ తర్వాత బాధితురాలిని పిలిపించి రాజీ కుదిర్చారు. పోలీసు స్టేషన్‌ వరకు వెళ్లినా తనపై చర్యలు లేకపోవటంతో ఆయన రెచ్చిపోయారు. మరింతగా వేధింపులకు గురిచేశారు. చివరకు ఆమె అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోవల్సి వచ్చింది. ‌

* పంచాయతీరాజ్‌లో పనిచేస్తున్న డీఈఈ స్థాయి అధికారి పైనా ఇదే తరహా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఎస్‌ఈ కార్యాలయంలో కీలకంగా నిర్వహిస్తున్న ఆ అధికారి అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు, లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో బాధితులు దిశ మహిళా పోలీసు స్టేషన్‌ను సంప్రదించినట్టు తెలిసింది.

* పుల్లలచెరువు పీహెచ్‌సీ వైద్యుడు తనను శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ నాయుడుపాలెం వీహెచ్‌సీలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న దేవికాబాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

అదృశ్యాలు.. అత్యాచారాలు

జిల్లాలో బాలికలు, మహిళలు, మైనర్లు ఏటా అదృశ్యమవుతున్నారు. రోజులు, నెలల తర్వాత కొందరి ఆచూకీ తెలుస్తున్నా.. మరికొందరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఇతర ఇబ్బందులు, కుటుంబ సభ్యులతో జగడాలు.. వంటి ఉదంతాల్లోనూ ఇళ్లు వదిలి వెళ్తూ పలువురు కనిపించకుండా పోతున్నారు. జిల్లాలో 2021, 2022లో ఇలా 51 మంది అదృశ్యమైనట్టు కేసులు నమోదయ్యాయి. 117 మందిపై అత్యాచారాలు చోటుచేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

* 2020 జులైలో ఒంగోలు నగరానికి చెందిన పదహారేళ్ల బాలిక అదృశ్యమైంది. పోలీసు విచారణలో సదరు బాలికను వదినే వ్యభిచార గృహం నిర్వాహకులకు విక్రయించినట్లు తేలింది.‌

* రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిని వ్యభిచార గృహానికి విక్రయించిన ఘటన కూడా గతంలో వెలుగు చూసింది.

* మద్దిపాడు మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఒంగోలు నగరంలోని ఓ కాలనీలో నిర్బంధించి వ్యభిచారంలోకి దించిన ఓ మహిళను ఆరు నెలల తర్వాత కానీ పోలీసులు పట్టుకోగలిగారు.

* కొత్తపట్నానికి చెందిన ఓ యువతిని శుభకార్యమంటూ బంధువే తీసుకెళ్లి ముంబైలో ఇతరులకు విక్రయించాడు.

సర్దుకుపోవాలంటూ ఒత్తిడులు...

మహిళా ఉద్యోగినుల పైనే కాకుండా, ఇతర పని ప్రదేశాల్లోనూ అనేక వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. ఇలాంటి సమయంలో వచ్చే ఫిర్యాదులపై పోలీసు శాఖ సత్వరం స్పందించి చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు మిన్నంటుతున్నాయి. చర్యలు తీసుకుంటే తమకు ఉద్యోగపరంగా ఎక్కడ చిక్కులు ఎదురవుతాయని వారి పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ, రాజీ చేసుకుని సర్దుకుపోవాలని బాధితుల పైనే ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో బాధితులు తమ ఫిర్యాదులను అనివార్యంగా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు.

పంచాయతీరాజ్‌లో కీచక అధికారి
విచారణ చేపట్టిన దిశ పోలీసులు!

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: అతను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పంచాయితీరాజ్‌ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడ పనిచేసినా తన పరిధిలో పనిచేసే మహిళా ఉద్యోగినులను వేధించడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. వెకిలి వ్యాఖ్యలు, అసభ్య సందేశాలు, సైగలతో మహిళలకు ఇబ్బంది కలిగిస్తూ తాను ఆనందిస్తుంటారు. గతంలో ఆయన పనిచేసిన ప్రాంతంలో అతని ధోరణిపై బాధిత ఉద్యోగినులు తమ శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ విచారణకు ఆదేశించారు. అధికారి ఆగడాలు వాస్తవమేనని తేలడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తాజాగా ఆయన బదిలీపై జిల్లా కేంద్రానికి వచ్చారు. ఎస్‌ఈ కార్యాలయంలో కీలకమైన విధుల్లో కొనసాగుతున్నారు. అప్పటి నుంచి చెలరేగిపోతున్నారు. మహిళా ఉద్యోగినుల పట్ల తన వికృత ప్రవర్తనను తరచూ బయట పెడుతున్నారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రవర్తనలో ఏమాత్రం మార్పులేదు. వేధింపులు రోజురోజుకీ ఎక్కువ కావటంతో చివరికి దిశ పోలీసు స్టేషన్‌ మెట్లెక్కారు. ఇప్పుడు ఈ వేధింపుల పర్వంపై విచారణ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని