logo

కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య

కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది.

Published : 24 Apr 2024 03:54 IST

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీరామ్‌ తెలిపిన వివరాల మేరకు..ఒంగోలుకు చెందిన గోపవరపు వెంకట భరత్‌కుమార్‌రెడ్డి (31) గత కొంతకాలంగా సింగరాయకొండలోని కందుకూరు రోడ్డులో నివాసముంటున్నారు. ఈయన స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో జూనియర్‌ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం భరత్‌ కరోనా బారిన పడటంతో రూ.లక్షలు ఖర్చవ్వడంతో కుటుంబం ఆర్థికంగా కుదేలైంది. వాటి నుంచి గట్టెక్కేమార్గం కన్పించకపోవడంతో ఆయన నాలుగుసార్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భరత్‌ కుమార్‌ రెడ్డి భార్య, కుమారుడిని తీసుకుని స్వగ్రామమైన బేస్తవారపేటకు వెళ్లారు. తల్లి ఒంగోలుకు వెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం తన పడక గదిలోకి వెళ్లి గాలి పంకాకు చీరతో ఉరి వేసుకున్నారు. ఫోన్‌ చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి సింగరాయకొండలోని ఇంటికి వచ్చి పరిశీలించగా కుమారుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది.  ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.


తనిఖీల్లో రూ.2.5 లక్షల నగదు స్వాధీనం

పామూరు, న్యూస్‌టుడే: మండలంలోని తిరగలదిన్నె చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మంగళవారం ఓ వ్యక్తి వద్ద ఉన్న రూ.2,58,350 నగదు పట్టుబడిందని తహసీల్దార్‌ షాకిర్‌ పాషా తెలిపారు. పామూరుకు చెందిన శ్రీసాయి ఏజెన్సీన్‌ నిర్వాహకుడు తన వ్యాపారం నిమిత్తం బిస్కెట్లు, ఇతర తినుబండారాలు గ్రామాల్లో దుకాణాలకు విక్రయించగా వచ్చిన నగదుతో పామూరు వస్తుండగా.. తిరగలదిన్నె చెక్‌పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది తనిఖీలు చేపట్టడంతో రూ.2,58,350 నగదు పట్టుబడింది. సదరు వ్యక్తి వద్ద ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతోనే నగదు స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్‌ పేర్కొన్నారు.


ఇప్పటివరకు రూ.20 లక్షల మద్యం పట్టివేత..

దర్శి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నియమావళి అందుబాటులోకి వచ్చినప్పటి (మార్చి 16) నుంచి ఇప్పటివరకు సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.4,89,980 నగదును పట్టుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారి లోకేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నగదుతో పాటు 174 లీటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సెబ్‌, ఎఫ్‌ఎస్‌టీ చేసిన దాడుల్లో రూ.20 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకోవటంతో పాటు విడి విక్రయాలు చేపడుతున్న దర్శిలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను సీజ్‌ చేశానమన్నారు. నియోజకవర్గ పరిధిలోని 27 ప్రాంతాల్లో ఉన్న 58 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 269 కేసుల్లో 3007 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు ఆర్వో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని