logo

నేను డీపీవో అయితే చచ్చిపోతారు

‘నేను రెగ్యులర్‌ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్‌ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు.

Published : 26 Apr 2024 04:48 IST

మద్దిపాడు ఈవోఆర్డీకి అధికారిణి హెచ్చరిక

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘నేను రెగ్యులర్‌ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్‌ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో పంచాయతీ కార్యాలయం ఎదుట దాతల సహకారంతో గతంలో ఆర్వో ప్లాంట్‌ నిర్మించి పంచాయతీకి అప్పగించారు. ప్లాంట్‌కు సంబంధించిన విద్యుత్తు మీటరు సర్పంచి పేరుపై ఉండగా, ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తూ నీటి వ్యాపారం చేస్తున్నారు. గత అయిదేళ్లుగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో రూ.5 లక్షలకు పైగా బకాయిలున్నాయి. రెండు రోజుల క్రితం ఆర్వో ప్లాంట్‌లో మీటరు కాలిపోయింది. మరమ్మతుల నిమిత్తం మీటరున్న గది తాళం ఇవ్వాలని సర్పంచి సూచించారు. అయినప్పటికీ గ్రామ కార్యదర్శి గురువర్ధిని అప్పగించలేదు. ఈ విషయాన్ని వైకాపా నాయకులు ఓ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఇన్‌ఛార్జి డీపీవో ఉషారాణికి ఫోన్‌ చేసి తాళం ఇప్పించాలని సూచించారు. ఆమె ఆదేశాల మేరకు కార్యదర్శి తాళం అందజేసినప్పటికీ ఇన్‌ఛార్జి డీపీవోకు తెలపలేదు. ఈ నేపథ్యంలో ఈవోఆర్డీ రఘుబాబుకు ఆమె గురువారం ఫోన్‌ చేశారు. ‘నేను రెగ్యులర్‌ డీపీవో అయితే మీరంతా చచ్చి పోతారు’ అంటూ హెచ్చరించినట్లు ఈవోఆర్డీ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన జిల్లా వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ విషయం ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శుల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని