logo

ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత

అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు.

Published : 01 May 2024 02:54 IST

ఒక్కటీ చేయకున్నా.. అన్నీ చేసేశానంటూ
అబద్ధాలు వల్లించిన జగన్‌

సభకు జనం రాకపోవడంతో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సమీకరిస్తున్న సుధాకర్‌బాబు, చెవిరెడ్డి

టంగుటూరు, న్యూస్‌టుడే: అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. హామీల జల్లు కురిపిస్తారని..ప్రాజెక్టులను గట్టెక్కిస్తానంటూ గట్టి హామీ ఇస్తారని ఎదురుచూసిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. నలభై నిమిషాల పాటు మాట్లాడినా..ఒక్కటీ ఉపకరించేది లేకపోవడంతో వారు పెదవి విరిచారు. నా ఎస్సీలు, నా ఎస్టీలంటూ పదే పదే ప్రస్తావించే జగన్‌, ఎస్సీ నియోజకవర్గం కొండపిలో పర్యటించినప్పుడు వారి అభ్యున్నతికి ఇది చేస్తానంటూ స్పష్టంగా చెప్పలేదు. ఎన్నో ఆశలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, యువకులు, ఆఖరికి పార్టీ నాయకులు కూడా చివరికి ఊసూరోమంటూ వెనుతిరిగారు.

జనానికి ఏం చెబుతాం: ముఖ్యమంత్రి సభలో బలమైన హామీలిస్తే స్థానికంగా ప్రచారం చేసుకుందామని భావించిన పార్టీ శ్రేణులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. స్థానికులను పలు సమస్యలు వెంటాడుతున్నాయి. పొగాకు రైతులకు ఊరట కలిగించే అంశాన్ని ప్రస్తావిస్తారని పలువురు భావించారు. ఇవన్నీ వదిలేసి చంద్రబాబుపై పసలేని విమర్శలు చేస్తూ..చెప్పిందే చెబుతూ ఊదరకొట్టడం వల్ల ఏం ఉపయోగమని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

సంగమేశ్వరం.. శీతల గిడ్డంగుల ఊసెత్తకుండా..: ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ 2019 మార్చి 20న టంగుటూరు బొమ్మల కూడలికి వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో సంగమేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తానని చెప్పారు. ఈ అయిదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఈసారైనా దానిపై స్పష్టత ఇస్తారన్న ఆశతో ఎదురు చూడగా, వారికి ఆశాభంగమే ఎదురైంది. ఇక పొగాకు నిల్వ చేసుకునేందుకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అది కూడా అలాగే మిగిలింది. శిథిల రోడ్లు..మంచినీటి కష్టాలు వంటివి అక్కడివారిని వెంటాడుతున్నాయి. ఇలా పాత హామీలన్నీ అలాగే మిగిలిపోగా.. అన్నీ చేసేశామని ఆయన చెప్పడంతో సభకు హాజరైన వారు ముక్కున వేలేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని