logo

చిరు జీవితాల్లో ఇసుక తుపాను

గద్దెనెక్కగానే కొత్త ఇసుక పాలసీ అంటూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బాకాలూదారు. ఆ వెనుకే జనాలకు గోతులు తవ్వే కుట్రలు పన్నారు. అక్రమాల జాతరకు తెర లేపారు. దేశానికే ఆదర్శమంటూ అనుయాయులకు రీచ్‌లు అప్పగించారు.

Published : 08 May 2024 04:52 IST

కట్టేవారి పొట్ట కొట్టిన జగను సర్కారు
వికృత విధానాలతో నిర్మాణ రంగం కుదేలు
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు
ఈనాడు, ఒంగోలు

గద్దెనెక్కగానే కొత్త ఇసుక పాలసీ అంటూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బాకాలూదారు. ఆ వెనుకే జనాలకు గోతులు తవ్వే కుట్రలు పన్నారు. అక్రమాల జాతరకు తెర లేపారు. దేశానికే ఆదర్శమంటూ అనుయాయులకు రీచ్‌లు అప్పగించారు. అదే సమయంలో వైకాపా నేతల ముసుగులో ఇసుకాసురులు రెచ్చిపోయారు. అనుమతులేమీ లేకుండా కనిపించిన అన్ని చోట్లా దర్జాగా తవ్వకాలు సాగించి, అమ్మేసుకున్నారు. సామాన్యులకు టన్ను ఇసుక దొరకడమే గగనంగా మార్చారు. నిర్మాణాలను నిలువునా కూల్చారు. భవనాలు కట్టే నిర్మాతల చేతులు కట్టేసి ఏకంగా పని లేకుండా చేశారు. ఆ రంగంపై ఆధారపడి జిల్లాలో బతుకుతున్న 1,20 లక్షల మంది జీవనోపాధిని దెబ్బతీశారు. పనుల కోసం పొట్ట పట్టుకుని పొరుగు రాష్ట్రాలకు పోయేలా చేశారు.


చెలరేగిన ఇసుక తోడేళ్లు...

ఇదే అదునుగా వైకాపా నాయకులు రెచ్చిపోయారు. ఇసుక తోడేళ్ల అవతారమెత్తారు. జిల్లా నలుమూలలా సహజ వనరుల దోపిడీకి బరి తెగించారు. దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కొండపి, ముసి నది,, గుండ్లకమ్మ, చిలకలేరు, దోర్నపువాగులను చెరబట్టారు. రేయనకా, పగలనకా యంత్రాలతో తవ్వకాలు సాగిస్తూ భారీ టిప్పర్లు, ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ అవకాశం పోతే మళ్లీ రాదన్నట్లుగా జేబులు నింపుకొన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకూ వాటాలు పంచారు. అధిక ధరలతో సామాన్యులు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితులు కల్పించారు.


దెబ్బతిన్న అనుబంధ  వృత్తులు 126...

వైకాపా ప్రభుత్వం అనుసరించిన ఇసుక విధానంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఫలితంగా నిర్మాణంతో పాటు 126 రకాల అనుబంధ వృత్తి పనుల కార్మికులు పనుల్లేక రోజు గడవని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇసుక ఇబ్బందులతో చాలామంది ఉపాధి కోల్పోయారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు కూడా ఇసుక కటకట ఏర్పడింది. ఇసుక ఉచితంగా అందజేస్తామని చెప్పినా లభ్యత లేక, బ్లాక్‌ మార్కెట్‌ కారణంగా ఒక్కో ట్రాక్టర్‌ ఇసుకకు రూ.2 వేలు నుంచి రూ.3 వేల వరకు రవాణా, కూలీ ఛార్జీల కింద లబ్ధిదారులు చెల్లించాల్సి వచ్చింది. వైకాపా నాయకులు, ఇసుక వ్యాపారులు మాత్రం ఇసుక కొరతను సృష్టించి పెద్దమొత్తంలో కొల్లగొట్టారు.


సంక్షేమ పథకాలు, బోర్డుకు తూట్లు...

జిల్లాలో భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్నవారి సంఖ్య వేలల్లో ఉంది. నమోదు చేసుకోని వారి సంఖ్య అంతకు మూడింతలుగా ఉంది. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునే సంక్షేమ బోర్డు నిధులనూ జగన్‌ సర్కారు నిలిపేసింది. కార్మికులకు నవరత్నాల పథకాలు ఇస్తున్నామంటూ సంక్షేమానికి తూట్లు పొడిచింది. వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకం తెచ్చినా.. బోర్డు నుంచి కార్మికుల పిల్లలకు సహాయం అందించలేదు. సంక్షేమ బోర్డు నుంచి ఆర్థిక సాయం చేస్తామని దరఖాస్తులు స్వీకరించి.. ఏ ఒక్కరికీ పైసా అందించలేదు. ప్రమాదాల బారిన పడి శాశ్వత వైకల్యం ఏర్పడినా పరిహారం అందించలేదు.

జిల్లాలో భవన నిర్మాణ కార్మికుల సంఖ్య 48 వేలు. వీరితో పాటు రాడ్‌బెండింగ్‌ మేస్త్రీలు, కూలీలు, సెంట్రింగ్‌, సామగ్రి మోసే కూలీలు, సీలింగ్‌ పనిచేసేవారు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగులు, టైల్స్‌ కార్మికులు, పెయింటర్లతో కలిపి ఆ సంఖ్య దాదాపు 1.50 లక్షల వరకు ఉంటుంది. వీరితో పాటు కంకర, ఇటుకలు, ఇసుక మోసే కూలీలు, నిర్మాణ రంగంపై ఆధారపడిన లారీ, ఆటో, ట్రాలీ డ్రైవర్లు, నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణదారులు, అందులో పనిచేసే కార్మికులు ఇలా మరికొందరు కలిపి ఈ సంఖ్య మరింత అదనం. ఇసుక లేక నిర్మాణ రంగం కుదేలు కావడంతో వీరంతా తీవ్రంగా నష్టపోయారు.


గత ప్రభుత్వంలో  ఉచితంగా...

తెదేపా ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం అమలైంది. తక్కువ మొత్తంలో కావాల్సినవారు మేరుగ రీచుల వద్దకు వెళ్లి తెచ్చుకునే అవకాశం ఉండేది. ఎక్కువ పరిమాణంలో కావాల్సి వస్తే దూరాన్ని బట్టి రవాణా ఖర్చులతో ట్రాక్టర్‌ రూ.1,200కే ఇళ్లకు తెచ్చుకోగలిగేవారు. నాలుగు టన్నులు రూ.1,000 నుంచి రూ. 1,200కే అప్పట్లో లభించింది. దీంతో చిన్నాచితకా నిర్మాణాలు నిత్యం కొనసాగాయి. భవన నిర్మాణ కార్మికులకు రోజూ చేతి నిండా పని ఉండేది.


వైకాపా గద్దెనెక్కాక దొరక్కుండా...

అబద్ధాలు ప్రచారం చేయడమే అలవాటైన జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో ఉచిత ఇసుక విధానంపై విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వం వస్తానే నూతన విధానంతో ఇంటి వద్దకే అందజేస్తామంటూ నమ్మించారు. గద్దెనెక్కాక టన్ను ఇసుక ధర తొలుత రూ.375, తర్వాత రూ.475 చొప్పున నిర్ణయించారు. దీనికి తోడు రవాణా ఛార్జీలు, కూలీ ఖర్చులు అదనం చేశారు. తర్వాత స్టాక్‌పాయింట్లు పెట్టి నిల్వ చేశారు. అవసరమైన వారు అక్కడి నుంచే ఇసుక తీసుకెళ్లాలంటూ మెలిక పెట్టారు. దీంతో ట్రాక్టర్‌ ఇసుక ధర రవాణా ఛార్జీలతో కలిపి ఒక్కసారిగా రూ.5 వేలకు చేరింది. దూరాన్నిబట్టి ఆ ధర రూ.7 వేల వరకు కూడా పెరిగింది. అయినా అందరికీ లభించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు