logo

పేదలపై నిర్దయ.. నిస్సిగ్గుగా ‘బీమా’య

మండుటెండైనా.. కుండపోత వానైనా.. స్వేదం చిందిస్తేనే గానీ పూట గడవని పేద బతుకులెన్నో! అలాంటి శ్రమజీవుల కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోతే బాధితుల వేదన అంతా ఇంతా కాదు..మాటలకందని అలాంటి పెను విషాదం వేళ..వారి వేదనను కొంతైనా దూరంచేసేందుకు ఉపక్రమించారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు.

Updated : 09 May 2024 05:10 IST

చంద్రన్న బీమాకు జగన్‌ తూట్లు
ఆప్తులు దూరమై..  సాయం భారమై..
కొర్రీలతో బాధితులకందని పరిహారం
న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం, పామూరు ]

మండుటెండైనా.. కుండపోత వానైనా.. స్వేదం చిందిస్తేనే గానీ పూట గడవని పేద బతుకులెన్నో! అలాంటి శ్రమజీవుల కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోతే బాధితుల వేదన అంతా ఇంతా కాదు..మాటలకందని అలాంటి పెను విషాదం వేళ..వారి వేదనను కొంతైనా దూరంచేసేందుకు ఉపక్రమించారు గత ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎలాంటి కఠిన నిబంధనలు విధించకుండా చంద్రన్న బీమాను ప్రవేశపెట్టారు. దీంతో ప్రతి పేద ఇంటికీ  పరిహారం అప్పట్లో దరిచేరింది. గత ఎన్నికల్లో జగన్‌ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక ఈ పథకం గొంతు నులిమేశారు. అర్ధంలేని కొర్రీలు పెట్టి బాధితులకు పరిహారం దరి చేరకుండా చేశారు.

పత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీ రాగానే అక్కసు వెళ్లగక్కింది. రెండేళ్లు అరకొరగా అమలుచేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడంతో ఆయా కుటుంబాలు విలవిల్లాడాయి. పథకానికి అర్హత సాధించలేక.. పరిహారం అందక.. బాధితులకు గుండెకోతే మిగులుతోంది. బకాయిలు ఎంతకూ చెల్లించకపోవడం..వేలల్లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్య వందల్లోకి పడిపోవడం జగనన్న ఎత్తుగడల్లో భాగమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా బాధిత కుటుంబాలు కష్టాల కడలిలో చిక్కుకుంటున్నాయి.


మూడో వంతు మందికే లబ్ధి

వైఎస్సార్‌ బీమా పథకాన్ని 2021 జులై నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి ఆరు నెలలకోసారి సరాసరిన 1100 మంది బీమా కింద క్లెయిమ్‌ చేసుకుంటున్నారు. అందులో 100 రోడ్డు ప్రమాదాలు ఉంటుండగా, వెయ్యి సహజ మరణాలు ఉంటున్నాయి. ఆ లెక్కన జిల్లావ్యాప్తంగా గత మూడేళ్లగా 6,600 మంది బీమా మంజూరు నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారు. అందులో సుమారు 2 వేల మందికి మాత్రమే రూ.16 కోట్ల వరకు నగదు జమ చేశారు.


అడుగడుగునా మోసం

బాధితులు మృతి చెందిన రోజునే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మృతి చెందిన వెంటనే డీఆర్డీఏ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయితే నెలల గడిచినా ఆర్థికసాయం ఇవ్వడం లేదు. ప్రయాణ మరణాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌, మరణ ధ్రువీకరణ పత్రం, శవ పరీక్ష నివేదిక ఉంటేనే సాయం వస్తోందని అధికారులు చెబుతున్నారు.ఈ కారణంతో ప్రతి ఏడాది వేలాది మందికి  బీమా అందడం లేదు. దాంతో బాధిత కుటుంబాలు పథకానికి దూరమవుతున్నాయి.


కేవలం రోడ్డు ప్రమాదాలకే ఇచ్చి..

2023 జులై ఒకటో తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 9వ తేదీ వరకు 858 మంది బాధితులు పరిహారం మంజూరు నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కేవలం 72 రోడ్డు ప్రమాద కుటుంబాలకు రూ.3.60 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని బ్యాంక్‌ ఖాతాలకు జమ చేశారు. మిగతా 4,600 కుటుంబాలు బీమా పరిహారం కోసం ఎదురుచూసి చివరికి మరిచిపోయే పరిస్థితి నెలకొంది. ఓ వైపు కుటుంబ యజమానిని కోల్పోయిన బాధితులు ఆవేదన చెందుతూ డీఆర్డీఏ మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


చంద్రన్న ఉదారత

తెదేపా హయాంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. సాధారణ మరణం అయితే 50 ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ.2 లక్షలు, 50 ఏళ్లకు పైబడి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేల బీమా పరిహారం అందించారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా పరిహారం అందేది. ప్రమాద బీమా కింద రూ.5 లక్షలిచ్చారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌తో సంబంధం లేకుండా వర్తింపజేశారు. రెండు నెలల్లోపే పరిహారం పంపిణీ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో బీమా కార్డులోని కుటుంబ సభ్యులు అందరికీ పథకం వర్తింపజేశారు.


ప్రభుత్వం రివర్స్‌ పాలన

వైఎస్సార్‌ బీమా కింద మూడేళ్ల క్రితం 6.80 లక్షల మంది పాలసీదారులను నమోదు చేశారు. 18-50 సంవత్సరాల మధ్య ఉండి, సంపాదించే వ్యక్తి సహజ మరణం పాలైతే ఆ కుటుంబానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల మధ్య ఉండి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతే బాధితులకు రూ.5 లక్షల ఆర్థికసాయం అందించాలి. అయితే కుటుంబ యజమాని చనిపోతేనే వైఎస్సార్‌ బీమా వర్తిస్తోంది. ఆ కుటుంబంలో భార్య పిల్లలు చనిపోతే బీమా పరిధిలోకి రారంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది. కుటుంబ యజమాని 50 ఏళ్లకు పైబడి సాధారణ మరణమైతే బీమా వర్తించదు.


వైకాపా సర్కారు పరిహారం ఇవ్వలేదు

-ఊసా ధనమ్మ, సీఎస్‌.పురం

నా భర్త ఊసా వెంకటసుబ్బయ్య పెయింటింగ్‌ పనులు చేసేవారు. ద్విచక్ర వాహనంపై వెళుతూ రెండేళ్ల క్రితం సీఎస్‌.పురం డొక్కలవాగు వద్ద  అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వైఎస్సార్‌ బీమాకు దరఖాస్తు చేసుకుంటే ఆయనకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదంటూ బీమా చెల్లించలేదు. తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబు రహదారి ప్రమాదంలో మరణించిన వారికి ఎలాంటి నిబంధనలు లేకుండా రూ.5 లక్షలు ఇచ్చారు. వైకాపా హయాంలో మాలాంటి వారికి న్యాయం జరగడం లేదు. భర్త లేక.. పరిహారం రాక ఆసరా లేకుండాపోయింది. కూలి పనులు చేసుకుని కష్టంగా బతుకీడుస్తున్నాను.


డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ముడిపెట్టి..

వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ బీమా పథకంలో కొత్త నిబంధనలు చేర్చడంతో బాధితులకు సాయం దరి చేరడం లేదు. రహదారి ప్రమాదాల్లో చనిపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి అంటూ కొత్త కొర్రీ పెట్టడంతో ఇబ్బందిగా మారింది. ఇది లేకుండా రహదారి ప్రమాదంలో మరణించిన వారు బీమాకు అనర్హులు. ఈ ఒక్క కారణంతో అనేకమంది బాధితులు పథకానికి దూరమవుతున్నారు. అసలే గ్రామీణులు ఎక్కువగా ఉండే ప్రకాశం లాంటి జిల్లాల్లో ఇది బాధితులకు శరాఘాతంగా మారింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను నిరక్షరాస్యులు సైతం తప్పనిసరిగా తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి ప్రచారం సైతం నిర్వహించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు