logo
Updated : 28/11/2021 04:08 IST

తల్లడిల్లిన కన్నపేగు..!

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, గుజరాతీపేట, లావేరు గ్రామీణం

కలుషిత ఆహారం తిని పదిమంది చిన్నారులకు అస్వస్థత

చికిత్స పొందుతున్న బాలిక శిరీష

అప్పటివరకు ఉత్సాహంగా ఆడిపాడిన చిన్నారులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. బిడ్డలను చూసిన ఆ కన్నోళ్లు కన్నీరుమున్నీరయ్యారు... చేతుల్లో పట్టుకొని ఆసుపత్రికి పరుగుపెట్టారు.. ఆ పసి ప్రాణాలను కాపాడేందుకు ఊరంతా కదిలింది.. లావేరు మండలం నేతేరు గ్రామంలో శనివారం చిన్నారులు కలుషితాహారం తిని  అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. శ్రీకాకుళంలోని సర్వజనాసుపత్రిలో తమ పిల్లలను కాపాడాలంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో సాయంత్రానికి పరిస్థితి కాస్త మెరుగుపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

రిమ్స్‌లో చిన్నారులకు వైద్యం అందిస్తున్న సిబ్బంది

అసలేం జరిగిందంటే..

బండి ఝాన్సీ, బండి శిరీష, ఎ.రామలక్ష్మి, బి.రోహిణి, లండ ధనుష్‌, కె.మహేష్‌, బి.ఉదయ్‌   కిరణ్‌, ఎ.స్వాతిక్‌, ఎ.విష్ణువర్ధన్‌, వి.సందీప్‌ ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. తొలుత కార్యకర్త పద్మావతి రోజూలాగే పిల్లలకు పాలు ఇచ్చారు. తర్వాత కోడిగుడ్లు తిన్నారు. 12 గంటల సమయంలో వారంతా వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన కార్యకర్త ఉన్నతాధికారులు, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గ్రామస్థులు, తల్లిదండ్రులు చిన్నారులను అంబులెన్సులో శ్రీకాకుళం తీసుకెళ్లారు. వైద్యులు తక్షణ చికిత్స అందించారు. కలుషిత ఆహారం తినడం వల్ల రక్తంలో టాక్సిన్లు విడుదలై బీపీ తగ్గిపోతుండడాన్ని గమనించామని, ఆ ప్రకారం చికిత్స అందించామని ఆర్‌ఎంవో హేమంత్‌ తెలిపారు.

తమ బిడ్డను కాపాడాలని వైద్యసిబ్బందిని వేడుకుంటున్న ఓ తల్లి

కోడిగుడ్లే కారణమా..?

కోడిగుడ్లు తినడం వల్లే సమస్య తలెత్తి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఒకసారి సరఫరా చేసిన గుడ్లు పది రోజుల్లోపే వినియోగించాలి. కాని కొన్నిచోట్ల గుత్తేదారులు చాలారోజుల ముందే సేకరించి దగ్గర పెట్టుకుంటున్నారు. దీనివల్ల పిల్లలకు ఇచ్చే సమయానికి అవి కుళ్లిపోతున్నాయి. దీనిపై విచారణ చేపట్టారు. పిల్లలు తాగిన పాల ప్యాకెట్లు అక్టోబరు 4న తయారైనట్లు తెలుస్తోంది. ఇవి 170 రోజుల వరకూ నిల్వ ఉంటాయని చెబుతున్నారు. బండి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లావేరు ఏఎస్‌ఐ భుజంగరావు తెలిపారు.


పరీక్షలకు నమూనాలు

నమూనాలను పరీక్షలకు పంపించామని ఐసీడీఎస్‌ పీడీ జి.జయదేవి పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్‌ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని