logo

ఆధ్యాత్మిక అడుగులు..

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచారపరిషత్తు ఆధ్వర్యంలో జిల్లాలో నూతన దేవాలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో హరిజన, గిరిజన, మత్స్యకార ప్రజల్లో ధార్మిక చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Published : 30 Sep 2022 06:32 IST

జిల్లాలో తితిదే ఆధ్వర్యంలో మరో 25 దేవాలయాల నిర్మాణం

గార మండలం కొంక్యాన పేటలో ఇటీవల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గ్రామస్థులు, సమరసతా సేవా ఫౌండేషన్‌ ప్రతినిధులు

 న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచారపరిషత్తు ఆధ్వర్యంలో జిల్లాలో నూతన దేవాలయాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో హరిజన, గిరిజన, మత్స్యకార ప్రజల్లో ధార్మిక చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యతలు దేవాదాయశాఖ, సమరసత సేవాఫౌండేషన్‌ సంస్థకు అప్పగించారు. ఇందులో భాగంగా జిల్లాకు కొత్తగా 25 ఆలయాలు మంజూరుకాగా తొలివిడతగా ఐదింటికి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు.
జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని హరిజన, గిరిజన కాలనీల్లో ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు. గతంలోనూ వివిధ మండలాల్లో 34 ఆలయాలు నిర్మించారు. ఇప్పుడు మరికొన్నింటికి అనుమతులు రావడంతో విడతలవారీగా పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతానికి గార మండలంలోని కొంక్యానపేట, బూర్జ మండలం ఉప్పినివలస, సోంపేటలో బుగడ గ్రామం, మందసలో బంసుగాం, పోలాకి మండలంలో గోవిందపురం గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

 స్థలం ఇస్తే చాలు...
ఎంపిక చేసిన గ్రామాల్లో ఆలయ నిర్మాణానికి స్థానికులు స్థలమిస్తే చాలు తితిదే ధర్మప్రచార పరిషత్తు, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ప్రతినిధులే చూసుకుంటారు. నిర్మాణానికి తితిదే గతంలో రూ.5 లక్షలు నిధులిచ్చేది. ప్రస్తుతం రూ.10 లక్షలు మంజూరు చేస్తోంది. పనులు పూర్తయిన తర్వాత దేవతామూర్తుల విగ్రహాలు, మైక్‌సెట్లు, ఉత్సవాల్లో ఊరేగింపు ఛత్రాలు వంటివి ఉచితంగానే అందజేస్తారు. స్థానికులనే అర్చకులుగా నియమిస్తారు. ఇప్పటికే తిరుపతిలో శ్వేత భవన్‌లో జిల్లా నుంచి ఎంపిక చేసిన 30 మందికి అర్చకులుగా మూడు విడతల్లో 15 రోజులపాటు శిక్షణ ఇచ్చారు.
నిధులు వచ్చిన వెంటనే..
ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో తితిదే సహకారంతో ఆలయాలను నిర్మిస్తున్నాం. జిల్లాలో నూతన నిర్మాణాలకు సుమారు 40 వరకు దరఖాస్తులొచ్చాయి. వాటిలో 25 మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉండటంతో వాటిని ఎంపిక చేశాం. ఆయా చోట్ల సుమారు మూడు సెంట్ల భూమిలో నిర్మాణానికి అనుమతులు లభించాయి. - రుప్ప వెంకటరమణ, జిల్లా కన్వీనర్‌, సమరసతా సేవా ఫౌండేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని