logo

చిల్లంగి అనుమానంతో అంతమొందించారు..!

తమ కుటుంబాన్ని చిల్లంగి పెట్టి చంపేస్తాడనే అనుమానంతో వరుసకు చిన్నాన్ననే అంతమొందించారు. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన గార మండలం బచ్చువానిపేటలో జరిగిన హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డీఎస్పీ ఎం.మహేంద్ర ఆదివారం విలేకరులకు వెల్లడించారు.

Published : 03 Oct 2022 02:50 IST

బచ్చువానిపేట హత్య కేసులో ముగ్గురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మహేంద్ర

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: తమ కుటుంబాన్ని చిల్లంగి పెట్టి చంపేస్తాడనే అనుమానంతో వరుసకు చిన్నాన్ననే అంతమొందించారు. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన గార మండలం బచ్చువానిపేటలో జరిగిన హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను డీఎస్పీ ఎం.మహేంద్ర ఆదివారం విలేకరులకు వెల్లడించారు. గార మండలం బచ్చువానిపేటకు చెందిన బచ్చు రామయ్య ఆగస్టులో హత్యకు గురయ్యాడు. దీనిపై రామయ్య కొడుకు అప్పన్న గార పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పన్న పెదనాన్న కొడుకైన బచ్చు రాజుపై అనుమానం వచ్చి విచారణ జరిపారు. రాజు ఇంట్లో రక్తపు మరకలతో ఓ టీ షర్ట్‌ కనిపిస్తే దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో బచ్చు రాజు, అతని అక్క, బావ పోలీసులకు దొరికిపోతామని భయపడ్డారు. ఆ వెంటనే రాజు తోణంగి వీఆర్‌వో సునీత వద్దకు వెళ్లి రామయ్యతో తమకు భూతగాదాలు ఉన్నాయని అందుకే హతమార్చామని ఒప్పుకొన్నాడు.

స్క్రూడ్రైవర్‌తో పొడిచి...
రాజు తల్లి, మేనల్లుడు ఆగస్టులో అనారోగ్యం పాలయ్యారు. వారికి రామయ్య చిల్లంగి పెట్టాడని అనుమానించి.. ఆయన్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజులపాటు రామయ్య రాకపోకలను గమనించారు. ఆగస్టు 12న తెల్లవారుజామున 3.30 గంటలకు రాజు, అతని అక్క  రమణమ్మ, బావ ఏదూరి అప్పలరాజులు పొలానికి వెళ్తున్న రామయ్యను కొర్లాం గ్రామ పొలాల్లో వెనుక నుంచి గొంతుపై స్క్రూడ్రైవర్‌తో పొడిచారు. ఆపై కర్రలతో కొట్టి చంపేశారు. వివరాలను వీఆర్‌వో తెలియజేయగా నిందితులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్‌ నిమిత్తం మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చినట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎల్‌ఎస్‌ నాయుడు, గార ఎస్‌.ఐ. మధు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని